గౌడ కుటుంబాల బహిష్కరణపై చర్యలు
మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్
హనుమకొండ, సెప్టెంబర్ 28(విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్(Tallarampur)లో 39 గౌడ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ పట్టణంలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు తోటకూరి రాందాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో జక్రాన్, పిప్రి ప్రాంతాల్లో జరిగిన ఘటనల తరహాలోనే తాళ్లరాంపూర్లో వీడీసీల పేరుతో 39 గౌడ కుటుంబాల(Gouda families)ను బహిష్కరించడం సభ్య సమాజం తలదించుకునే విషయమన్నారు.
వీడీసీల ముసుగులో జరుగుతున్న సామాజిక వివక్ష, అణచివేత చర్యలను అరికట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. బహిష్కరణకు గురైన కుటుంబాలకు అండగా నిలిచి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గౌడ కులానికే పరిమితమైన వెలివేత వంటి ఘటనలు భవిష్యత్తులో ఇతర అట్టడుగు వర్గాలకూ విస్తరించే ప్రమాదం ఉందని రమేష్ గౌడ్ హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు గౌడ సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బహిష్కరణకు పాల్పడిన దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు గౌడ సంఘాలు సిద్ధం కావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి వల్లాల సదానందం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మగాని శ్యామ్ సుందర్ గౌడ్, పట్టణ గౌరవ అధ్యక్షులు జూలూరి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి గడ్డమీది అశ్విన్ గౌడ్, తాళ్లపెళ్లి చంద్రమౌలి గౌడ్, రడం శ్రీనివాస్ గౌడ్, బొమ్మేర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.