క్యూఆర్ కోడ్‌తో అడ్మిట్ కార్డు

05-05-2024 01:40:17 AM

పేషెంట్లు లైన్‌లో నిల్చునే అవసరం లేకుండా నూతన విధానం  

నిజామాబాద్ ఆసుపత్రిలో అందుబాటులోకి..

నిజామాబాద్, మే 4 (విజయక్రాంతి): పేషెంట్లు క్యూలో నిల్చునే అవసరం లేకుండా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. పేషెంట్లు తమ మొబైల్ ఫోన్‌తో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అడ్మిట్ కార్డును పొందే వెసులుబాటును కల్పించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్  ఈ విధానాన్ని శనివారం ప్రారంభించారు. ఈ విధానంలో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉన్నవారు ప్లే స్టోర్ నుంచి ఏబీడీఎం అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఓ నంబర్ వస్తుంది. దానిని కౌంటర్‌లో చెబితే వారికి ఔట్ పేషెంట్ కార్డును జారీ చేస్తారు. ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా రోగులకు ఆసుపత్రిలో తక్కువ సమయంలో ఔట్ పేషెంట్ కార్డు లభించడంతో చికిత్స త్వరగా లభించనుందని, భారీ క్యూలైన్‌ల నుంచి ఉపశమనం లభిస్తుందని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు.