29 March, 2026 | 3:23 PM

కాంగ్రెస్‌కు అధిక మెజార్టీ రావాలి

05-05-2024 01:43 AM

మునుగోడు, మే 4: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఉండాలని భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 26 గ్రామాల ముఖ్య నాయకులు, బూత్ కమిటీ ఇన్‌చార్జ్‌లు, బూత్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అన్ని నియోజకవర్గాల కంటే మునుగోడులో అధిక ఓట్లు వేయించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల్లో ఊబిలో నెట్టారని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తల పైన ఉందని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి 75 శాతం పైన ఓట్లు వస్తాయని, వార్ వన్ సైడ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, నారబోయిన రవి ముదిరాజ్, కొలను రాజేందర్ రెడ్డి, భీమనపల్లి సైదులు, ఎంపీపీ కర్నాటి స్వామి తదితరులు పాల్గొన్నారు.