అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 3 (విజయక్రాంతి): కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్వహించనున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశభక్తి, పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
సోమవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాకు ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమని, ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేసి వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు.
ప్రగతి మైదానంలో ప్రధాన వేదికను ఆకర్షణీయంగా రూపొందించడంతో పాటు ప్రోటోకాల్కు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, అధికారులు, విశిష్ట అతిథులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను సక్రమంగా ఏర్పాటు చేసి బ్యారికేడ్లు, పార్కింగ్, సూచిక బోర్డులు, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్లు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటర్ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు వేదిక, విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు సిద్ధంగా ఉంచి సౌండ్ సిస్టమ్, మైకులు, లైటింగ్, ఎల్‌ఈడీ స్క్రీన్లు ముందస్తుగా పరీక్షించాలని సంబంధిత శాఖలకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని తెలిపారు.
వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, అటవీ, వైద్యం, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఆర్టీసీ తదితర శాఖలు తమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులతో దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటికలు నిర్వహించి జాతీయ భావనను పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డిఆర్‌ఓ పద్మావతి, జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.






