బలహీన వర్గాల పక్షాన నిలిచే ఏకైక పార్టీ సిపిఐ
- ప్రజలకు సేవలు అందిస్తూ గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలి
- సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
చుంచుపల్లి, (విజయక్రాంతి): ఎమ్మెల్యే కూనంనేని ప్రగతి, సిపిఐ ప్రజాపోరాటాలకు ఆకర్షితులై పేద, బడుగు, బలహీన వర్గాలు భారీగా పార్టీలో చేరుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. చుంచుపల్లి మండలం అంబేద్కర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్ గ్రామానికి చెందిన 15 కుటుంబాలు శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేరిన వారికి ఆయన పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పేద ప్రజల ఆశాజ్యోతిగా సిపిఐ నిలిచిందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ఏకైక పార్టీ ఎర్రజెండానే అని స్పష్టం చేశారు.
పార్టీలో చేరిన కొత్త సభ్యులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి సేవలందిస్తూ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపు నిచ్చారు. అంబేద్కర్ నగర్ గ్రామాభివృద్ధికి, అక్కడ దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కూనంనేని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారని, ప్రజల పక్షాన నిలబడి పోరాడే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వివరించారు. పార్టీలో చేరిన వారిలో పోతురాజు శ్రీను, మధు, ఎం. పుల్లయ్య, ఇనుగంటి రాజు, మహేష్, సారయ్య, భాస్కర్, పరిశుద్ధ ఉన్నారు.






