15 April, 2026 | 3:16 AM

బలహీనులతో సంధి ఆదరణీయం

15-04-2026 12:00 AM

హీనశ్చేత్ సర్వత్రాను 

ప్రణతస్తిష్ఠేత్ సంధిముపేయాత్

ఆరణ్యో౨గ్ని రివ హి దుఃఖామర్షజం 

హి తేజో విక్రమయతి

మండలస్యచానుగ్రాహ్యో భవతి!

 (కౌటిలీయం - 7-3-4)

బలం తక్కువగా ఉన్నవాడు (హీనుడు) అన్ని విషయాలలోనూ తనకు వంగి యున్నట్లయితే అతనితో సంధి చేసుకోవాలే కానీ, దురహంకారాన్ని ప్రదర్శించి అవమానించకూడదు. బలవంతుడ లా సంధి చేసుకోనట్లయితే బలహీనుడప్పటికి తగ్గియున్నా, ఏనాటికైనా అతనిలోని దుఃఖం, అసహనం, కోపం.. దావాగ్నిలా మారి అతనిలోని తేజస్సును (పరాక్రమాన్ని) వెలికితీస్తాయి. శక్తి చాలనినాడు, శత్రురాజులకు అనుకూలుడై... శక్తిని కూడగట్టుకొని అవకాశం కోసం చూస్తాడు. రాజమండలం కూడా ‘ఇతడెంత ఒదిగి యున్నా రాజు పీడిస్తున్నాడనే’ సానుభూతితో అతనికి సహాయం చేయాలని భావించే అవకాశం ఉంటుంది. దానితో బలవంతుడైన రాజుకూ.. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, అంటాడు ఆచార్య చాణక్య.

బలం తగ్గిన సమయంలో సహకార ధోరణిలో ప్రవర్తిస్తూ, నమ్రతతో, సందర్భానుసా రంగా వ్యవహరించగలిగిన నైపుణ్యాన్ని ప్రదర్శించాలే గాని, అంతరంగంలో గెలవాలనే సంకల్పాన్ని, పట్టుదలను విడవవద్దని, బలహీనతలను బలాలుగా మార్చుకోవాలని, సహచర సమాజంపై తన ప్రాబల్యాన్ని పెం చుకోవాలని చాణక్య చెపుతున్నాడు. ఇదీనా టి పరిస్థితులకు దర్పణం. నాటో వంటి కూటములు చిన్న, మధ్యస్థ దేశాల పరస్పర సహకారంతో ఏర్పడినవే. ఇవి పెద్ద శక్తుల ఆధిపత్యాన్ని సమతుల్యం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

ఈనాడు, పలుదేశాలు ఇతర దేశాలతో ఆర్థిక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవడం, దౌత్య సంబం ధాలు పెంచుకోవడం ద్వారా, చర్చల ద్వారా సంక్షోభానికి దారితీసే ఘర్షణలను నివారించుకోవడం గమనించవచ్చు. స్వయం సమృద్ధిని సాధించే దిశలో దేశాలు.. తమ ఆర్థిక స్థితిగతులను ఉన్నతీకరించుకోవడం, సాంకేతిక ప్రగతిని సాధించడంపై దృష్టిని కేంద్రీకరిస్తూనే సైనిక పాటవాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్, చైనాలాంటి దేశాలు సుదీర్ఘకాలంగా ప్రత్యక్ష యుద్ధాలను పరిహరిస్తూ.. ఆర్థికప్రగతిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.

దానితో ప్రపంచ వాణిజ్యరంగంపై తమ ప్రాభవాన్ని చూపగలుగుతున్నాయి. దీనిని అంతర్గతంగా శక్తిని సమకూర్చుకుని, సరైన సమయంలో ప్రపంచ వేదికపై ప్రభావాన్ని చూపాలని చాణక్య చెప్పిన దావాగ్నికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అలాగే జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధం తదుపరి చూపిన పునర్నిర్మాణ దీక్షవల్ల ప్రపంచంలో ప్రధాన ఆర్థికశక్తిగా రూపు దిద్దుకున్నది. నిజానికి బాహ్యమైన కష్టనష్టాలు అంతర్గతంగా బలోపేతమై, సృజనా త్మకంగా ఎదిగేందుకు దోహదపడతాయి.

మహాభారతంలో పాండవులు రాజసూ య యాగంలో భాగంగా జైత్రయాత్ర నిర్వహించారు. యుద్ధాలలో మరణించిన/ ఓడిపోయిన రాజ్యాలలో వ్యూహాత్మకంగా ఆయా రాజ్యాల వారసులను నియమించడం వల్ల పాండవుల ఆధిపత్యం అంగీ కరింపబడింది. యాగ నిర్వహణ సజావుగా జరిగింది. అయినా కొందరిలో పేరుకుపోయిన అసంతృప్తి జ్వాలలు, అవకాశం వచ్చి న సమయంలో బయటకు వచ్చి, దుర్యోధనుని పక్షంలో పదకొండు అక్షోహిణుల సైన్యం సమకూరేందుకు కారణమైంది.

అయితే సైనికపరంగా, ఆర్థికపరంగా తాను బలవంతుడనని, పాండవులు పదమూడు సంవత్సరాలు రాజ్యానికి దూరంగా ఉండ డం వల్ల వారు బలహీనులయ్యారని, వారిని సునాయాసంగా జయించగలనని భావించిన దుర్యోధనుడు, బలహీనులతో సంధి చేయనని, మహాయుద్ధానికి తెరతీశాడు. పాండవులను, వారి వ్యూహాలను తక్కువగా అంచనావేయడం వల్ల పాండవుల అంతరంగంలో జ్వలిస్తున్న ప్రతీకారేచ్ఛ, అవమానమ నే దావాగ్నితో కూడి కౌరవ వంశాన్ని పూర్తి గా కాల్చివేసింది. పాలకులెంత బలవంతులై నా ఎదుటివారిని తక్కువగా అంచనావేయడం ఎప్పటికైనా అనర్థదాయకమే.

ధృతరాష్ట్రుని మంత్రి కణికుడు సూచించినట్లుగా... సాధ్యమైనంత వరకు దౌత్యపరమై న మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమం. అలా కుదరని పక్షంలో, చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే విధానంలో అసాధారణ మార్గాల ద్వారా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడకూడదు. విదురుడు కూడా బలహీనుడైన వాడు అనవసరమైన యుద్ధాలను ఆహ్వానించవద్దని సలహా ఇస్తాడు.

దానికి ఉదాహరణగా గాలి బలంగా వీచినప్పుడు వంగిపోయిన రెల్లుమొక్క నిలుస్తుంది.. ఎదురునిలిచిన వృ క్షాలు కూకటివేళ్లతో కూలిపోతాయి, అం టాడు.  ప్రస్తుతం ప్రపంచంలో దేశాల మధ్య సంబంధాలు ప్రధానంగా ఆర్థిక ప్రయోజనాలపై ఆధారపడి మారుతూ ఉన్నాయి. అం దువల్ల వారివారి ఆర్థిక, వాణిజ్య, వ్యాపారా ల ప్రయోజనాలే ప్రధానమై దేశాల మధ్య శాశ్వత శత్రుత్వ, మిత్రుత్వ భావనలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి.

అసహనం, ఆధిప త్య ధోరణులు పెరగడం వల్ల పరస్పర సహకారం, స్పర్ధ, సంతృప్తులు శాశ్వతంగా నిలవడం లేదు. దౌత్య సంబంధాలూ బలహీనమౌతాయి. కపటోపాయంతోనైనా గెలవా లనే భావనలు, తదనుగుణమైన వ్యూహరచనలు తాత్కాలిక విజయాలను ఇవ్వవచ్చు కాని దీర్ఘకాలంలో అశాంతికి నిలయాలవుతాయి. దానితో బలహీన దౌత్య సంబంధా లు అంతర్గతంగా ఒత్తిడిని పెంచుతున్నాయి. నిజానికి, లాభ నష్టాల విశ్లేషణ చేయని యుద్ధాలలో సాధించిన విజయం నిరర్ధక విజయంగా మారవచ్చు.

భారతదేశంలో జాతీయ పార్టీలు స్పష్టమైన ఆధిక్యతను సాధించలేకపోవడంతో, ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకశక్తులుగా మారాయి.  దానితో  జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించడం తప్పనిసరి అయింది. ఎన్టీ రామారావు ఆధ్వర్యవంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇలా పలు ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలు తక్కువగా అంచనా వేసి అవమానించినా, చివరగా వాటితో జతకట్టి అధికారాన్ని పంచుకోక తప్పని పరిస్థితి ఎదురైంది.

అలాగే ఒకప్పుడు ఇరువురు సభ్యులతో మాత్రమే లోక్‌సభలో ఉన్న భారతీయ జనతా పార్టీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగిన స్థాయికి తదుపరి కాలంలో ఎదిగింది. రాజకీయాలలో శక్తి ఎప్పుడూ స్థిరంగా ఉండదు. బలహీనంగా కనిపించే శక్తి, సరైన సమయానికి, సరైన వ్యూహంతో, ప్రజా మద్దతుతో, పెద్ద శక్తిగా మారగలదు. దానిని మరిస్తే విజయమే అపజయమౌతుంది. ఈనాడు యుద్ధాలలో గెలవడమే ముఖ్యం కాని ఎలా గెలిచామనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఎదుటివారిలోని వినయం బలహీనత కాదు, సహనం ఓటమీ కాదు. అవి సమయోచిత వ్యూహాలుగానూ, శాశ్వత విజయానికి మార్గం చూపే సన్నద్ధతగానూ భావించాలి.

పాలకుర్తి రామమూర్తి