15 April, 2026 | 3:16 AM

ఆర్టీసీ కార్మికుల పోరు

15-04-2026 12:00 AM

హామీల అమల్లో మొండిచేయి.. బకాయిల చెల్లింపులో మీనమేషాలు.. వెరసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారింది. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడిచినా ఉలుకూ పలుకూ లేని ప్రభుత్వ యంత్రాంగం, 45 వేల మంది కార్మికులను మళ్లీ రోడ్డెక్కేలా చేస్తోంది. ఇది కేవలం వేతనాల కోసం జరుగుతున్న ఆరాటం కాదు, తమ ఉనికిని కాపాడుకోవడానికి కార్మికులు చేస్తున్న చావోరేవో తేల్చుకునే పోరాటం.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏకం చేసి, ‘సకల జనుల సమ్మె’లో వెన్నెముకగా నిలిచిన ఆర్టీసీ కార్మికులకు స్వరాష్ట్రంలో నేడు సమ్మె నోటీసు పట్టుకుని చర్చల కోసం అర్థించాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటు. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తామన్న జేఏసీ నిర్ణయం వెనుక దశాబ్దాల అణచివేత, నెరవేరని వాగ్దానాల గుట్ట ఉంది.

కార్మికుల సొంత నిధులైన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్), ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్మును యాజమాన్యం వారి అనుమతి లేకుండా ఇతర అవసరాలకు మళ్లించడం ఆర్టీసీలో అత్యంత దారుణమైన విషయమని చెప్పవచ్చు. దాదాపు రూ.1,200 కోట్ల మేర పేరుకుపోయిన ఈ బకాయిలు ఎప్పుడు వస్తాయో తెలియక, పదవీ విరమణ చేసినవారు తమ పిల్లల పెళ్లిళ్లకు, వైద్య చికిత్సలకు డబ్బులు లేక అల్లాడిపోతున్నారు.

2015 నుంచి పూర్తి స్థాయిలో వేతన సవరణ (పీఆర్సీ) జరగకపోవడం, 11వ పీఆర్సీ అమలులో జాప్యం చేయడం వల్ల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పోలిస్తే, ఒక డ్రైవర్ లేదా కండక్టర్ పొందు తున్న ప్రారంభ వేతనం రూ.19,000 వారి శ్రమకు ఏ మాత్రం తూగదు. ప్రభుత్వం వెంటనే 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ వెనుక ఒక బలమైన భయం ఉంది.

సంస్థ నష్టాల్లో ఉందనే సాకుతో క్రమంగా ప్రైవేటీకరణ వైపు అడుగులు పడుతున్నాయని కార్మికులు ఆందోళన చెందుతున్నా రు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, అక్కడి కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించినప్పుడు, తెలంగాణలో అది ఎందుకు అసాధ్యం?  కొవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వలస కూలీలను స్వస్థలాలకు చేర్చిన ఘనత ఆర్టీసీ కార్మికులదే. ఆనాడు వారిని ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’ అని ఆకాశానికెత్తిన పాలకులు, నేడు హక్కుల కోసం పోరాడుతుంటే ఎందుకు ముఖం చాటేస్తున్నా రు? 300 మందికిపైగా సిబ్బందిని కొవిడ్‌కు బలిచ్చిన ఈ వ్యవస్థ, నేడు వారి కుటుంబాలకు కనీస కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేకపోతోంది.

కార్మికులు పెట్టిన 32 డిమాండ్లు కేవలం జీతాలకు సంబంధించినవి కావు, అవి సంస్థను బలోపేతం చేసేలా ఉన్నాయి. కాలం చెల్లిన 3,000 బస్సుల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలన్న డిమాండ్ ప్రయాణికుల భద్రతతో ముడిపడి ఉంది. మహిళా కండక్టర్లకు ప్రత్యేక విశ్రాంతి గదుల ఏర్పాటు, వారికి రాత్రి డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వడం వంటివి మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అంశాలు.

డ్యూటీలో ఉండగా మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించడం వారి సామాజిక భద్రతకు గ్యారెంటీ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ప్రజా రవాణా వ్యవస్థలు కేవలం లాభాల కోసం పని చేయవు. అది ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. డీజిల్ ధరలు పెరిగినా, ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు అందకపోయినా నేటి వరకు కార్మికులు సంస్థను భుజాలపై మోశారు. గత ఐదేళ్లలో సంస్థపై పడిన రూ.6,000 కోట్ల భారాన్ని కార్మికుల శ్రమతోనే కొంతవరకైనా తట్టుకోగలిగారు. మరి ఇంతటి త్యాగనిరతి ఉన్న వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు నెట్టడం ఎంతవరకు సమంజసం? ప్రైవేట్ వ్యక్తుల లాభాల కంటే ప్రజల సౌకర్యమే ముఖ్యమని ప్రభుత్వం గుర్తించాలి.

సమ్మె జరిగితే రోజుకు సుమారు 30 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడతారు. ఈ భారీ నష్టానికి, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ‘ఆర్టీసీ బతకాలి - కార్మికుడు బతకాలి’ అనే నినాదం మాటలకే పరిమితం కాకూడదు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆర్టీసీని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. అప్పుడే తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది.

 వ్యాసకర్త సెల్: 9848559863