పేదవాడి పొట్టకొడుతున్న విపత్తులు
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్, లెబనాన్‌పై చేస్తున్న యుద్ధం పరాకాష్టకు చేరింది. ఆ యుద్ధ ప్రభావం మన ఇంటిపైనా పడుతున్నది. ఎరువులు, ఫార్మారంగం, సిమెంట్, స్టీల్, తయారీరంగంతోపాటు అనేక పరిశ్రమలు కుదేలవు తున్నాయి. ముఖ్యంగా చమురు కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. దాంతో అనేక హోటళ్లు మూతబడ్డాయి. మళ్లీ కట్టెలు, బొగ్గు పొయ్యి వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ భూగోళంపై ఎక్కడ, ఏ చిన్న పరిణామం సంభవించినా, దాని ప్రభావం యావత్ ప్రపంచంపై, మొత్తం దాదాపు 850 కోట్ల మంది మానవులపై ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రకృతి కన్నెర్రజేసినా, ప్రపంచంపై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాల మధ్య పోరు జరిగినా, సామ్రాజ్యవాద దాడులైనా, కల్తీ జరిగినా, మహ మ్మారి సోకినా, ఇంకేదైనా విపత్తు సంభవించినా.. అది సామాన్య మానవుల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే సబ్ సహారా, ఆసియా, ఆఫ్రికా ఖండ ప్రజ ల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ముఖ్యం గా 1991 తరువాత సరళీకృత ఆర్థిక విధానాలు, సోవియట్ యూనియన్ విడిపోవ డం, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో గణనీయంగా మార్పు లు చోటుచేసుకున్నాయి. దీనికి తోడు వరద లు, భూకంపాలు, సునామీలు, అగ్ని ప్రమాదాలు, తరచూ యుద్ధాలు, ఇటీవలి కొవిడ్ విలయతాండవం మొత్తం ప్రపంచాన్ని ఏ సమయానికి, ఏ వైపునకు నెడుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.
1990 వరకూ ఒకవైపు సోవియట్ యూనియన్ (రష్యా), మరోవైపు అమెరి కా బలంగా ఉన్నాయి. ఇరు పక్షాలు ప్రపంచంపై ఆధిపత్యం కోసం పోరు సలిపాయి. ఆ సమయంలో ఒకవైపు అమెరికా, మరొకవైపు సోవియట్ యూనియన్ సమ ఉజ్జీలుగా ఉండటం, ఇరు పక్షాలు శక్తిమంతంగా ఉండ టం, ఏదైనా పరిణామం జరిగినా దీటుగా బదులిచ్చుకునే పరిస్థితి ఉండేది. దాంతో దాదాపు ప్రపంచ దేశాలు సమన్వయం చేసుకుంటూ సామరస్యంగా సాగాయి.
ఎప్పుడైతే రష్యా తన ప్రభావాన్ని కోల్పోయిందో, తిరుగులేని శక్తిగా అమెరికా ఆవిర్భవించింది. సోవియట్ యూనియన్ పతనం కావడంతో అమెరికా ఆధిపత్యానికి తిరుగులేకుండాపోయింది. తనను ఎదిరించేవారు, తన మాట కు ఎదురుచెప్పే వారు లేకపోవడంతో అగ్రరాజ్యం ఆడిందే ఆట, పాడిందే పాట అన్న ట్టు పరిస్థితి తయారైంది. తన మాట వినని, తనకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలపై ఏదో ఒక సాకు చెప్పి, వాటిపై దండెత్తి అమెరికా తన అధీనంలోకి తీసుకోవడం సర్వసా ధారణంగా మారిపోయింది.
గతంలో ఇరాక్, లిబియా వంటి దేశాలపై, తాజాగా వెనెజువెలా, నేడు ఇరాన్‌పై సామ్రాజ్యవాద ఆదిపత్యం ధోరణితో అమెరికా దాడులు, యుద్ధాలకు దిగుతున్నది. తద్వారా మొత్తం ప్రపంచాన్ని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నది. సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే భావనతో ప్రపంచ దేశాలన్నింటిపై ‘ట్రేడ్ వార్’కు శ్రీకా రం చుట్టారు.
తనకు నచ్చిన విధంగా ప్రతీకార సుంకాలు విధిస్తూ ప్రపంచ దేశాలపై అప్రకటిత వాణిజ్య యుద్ధానికి దిగారు. దాంతో దాదాపు అన్ని దేశాలు అమెరికాకు దూరం జరిగాయి. ఎప్పటినుంచో వ్యాపార, స్నేహా సంబంధాలు కలిగి ఉన్న నాటో దేశా లు, యూరోపియన్ దేశాలు, మెక్సికో, కెన డా, చివరికి మన దేశంతో సహా పలు దేశా లు అమెరికా వాణిజ్య యుద్ధం కారణంగా దానికి దూరమయ్యాయి. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌తో సన్నిహితంగా మెలగడం, భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పారు.
అంతేకాదు, గ్రీన్‌ల్యాండ్ తమకు కావాలని బెదిరింపులకు పాల్పడ టం, త్వరలో క్యూబాను స్వాధీనం చేసుకుంటానని ప్రకటించడం, ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధం చేయడానికి దిగడం వంటి చర్యల వల్ల మొత్తం ప్రపంచం సంక్షోభంలో చిక్కుకుంది. అయితే, చిన్నాచితకా దేశాలైన కొలం బియా, మెక్సికో వంటివి కూడా ట్రంప్ విధానాల పట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
కానీ, మన కేంద్ర ప్రభుత్వం, మన ప్రధాని మాత్రం కనీసం ట్రంప్ విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయకపోవడం శోచనీయం. మన దేశం అలీన విధానాన్ని విడనాడటం, ట్రంప్‌తో సన్నిహితంగా ఉండటం వల్ల పెను సవాళ్లను ఎదుర్కొంటుంది. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యలను ఖండించాల్సిన అవసరముంది.
బ్రిక్స్ దేశాలు, ముఖ్యంగా రష్యా, బ్రెజిల్, చైనా వంటి దేశాలతో కలిసి ప్రపంచ శాంతి కోసం దౌత్యపరమైన చర్యలు చేపట్టడం ఉత్తమం. కేవలం కంటితుడుపు చర్యలాగా, సమస్యల పరిష్కారానికి చర్చలే ఉత్తమ మార్గమని చెప్పడం వలన కలిగే ఫలితాలు శూన్యం మాత్రమే. ప్రపంచ మానవా ళి వినాశనాన్ని నిలువరించేందుకు భారత్ వంటి దేశాలు ప్రత్యక్షపాత్ర పోషించాలని ఆశిద్దాం.
రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పా టు చేసిన ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరో గ్య సంస్థ, పర్యావరణ పరిరక్షణ వేదికల నుం చి అమెరికా బయటకుపోవడం కూడా మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. దీంతో నిధులు లేక పేద, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆరోగ్య సంరక్ష ణ కార్యక్రమాలు నిలిచిపోయి అనేక పేద దేశాలు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి నెలకొన్నది.
ఇక అమెరికా, ఇజ్రాయె ల్ కలిసి ఇరాన్, లెబనాన్‌పై చేస్తున్న యుద్ధం పరాకాష్టకు చేరింది. ఆ యుద్ధ ప్రభావం మన ఇంటిపైనా పడుతున్నది. ఎరువులు, ఫార్మారంగం, సిమెంట్, స్టీల్, తయారీరంగంతోపాటు అనేక పరిశ్రమలు కుదేలవు తున్నాయి. ముఖ్యంగా చమురు కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. దాంతో అనేక హోటళ్లు మూతబడ్డాయి. మళ్లీ కట్టెలు, బొగ్గు పొయ్యి వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇతర ఆఫ్రికా దేశాలు, చివరికి ఎంతో అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల ప్రజలు జీవితాలను ఈ యుద్ధం అల్లకల్లోలం చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఏకమై సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణితో వెళ్తున్న అమెరికా వంటి దేశాలకు ప్రజాస్వామ్య పద్ధతిలోనే గుణపాఠం చెప్పాలి. మన లాంటి దేశాలు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకొని ‘విశ్వగురు’ పాత్రను సమర్థవంతంగా పోషించాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం ఇప్పటికైనా నడుం బిగించాలి. ఉత్సవ విగ్రహంగా మారిన ఐక్యరాజ్యసమితికి పునర్జీవం పోయాలి. ఆ సంస్థను పునర్వ్యవస్థీకరణ చేయాలి.
ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఏదో ఒక విషయంలో మరో దేశంపై ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని సామ్రాజ్య వాద, పెట్టుబడీదారీ, ఆదిపత్య దేశాలకు తెలియజేయాలి. ఏ దేశాన్ని అయితే గొప్ప దేశం గా తయారు చేయాలని ట్రంప్ ఆశిస్తున్నారో ఆ దేశ ప్రజలే ‘నో కింగ్స్’ పేరిట భారీ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని అధికార, ప్రతిపక్షాలు కూడా ట్రంప్ విధానాలు పట్ల విసిగిపోతున్న సమయంలో ప్రపంచంలోని ఇతర దేశాలు ఒకటై ప్రపంచ శాంతికి, మానవ హక్కుల పరిరక్షణకు, మానవ మనుగడకు పాటుపడాలి.
ఇరాన్ ఎంతటి సంకల్ప బలంతో తన ప్రాచీన పర్షియన్ నాగరికతను కాపాడుకోవడానికి, తన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, హోర్ముజ్ జలసంధిని తన ఆధీనంలో ఉం చుకోవడానికి, అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశంతో పట్టు సడలకుండా తన ఒంట రి పోరాటం కొనసాగిస్తుందో, అలాగే ఇతర ప్రపంచ దేశాలు కూడా ప్రపంచ శాంతి కోసం, సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకం గా పోరాడాలి. అప్పుడు మాత్రమే సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడి నిజమవుతుంది.
వ్యాసకర్త సెల్: 6305682733
ఐ.ప్రసాదరావు






