4 August, 2026 | 3:11 AM

రైస్‌మిల్లుల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలి

04-08-2026 01:38 AM

భైంసా, ఆగస్టు 3 ( విజయ క్రాంతి): ముధోల్ నియోజకవర్గంలోని బైంసా రెవెన్యూ డివిజన్ పరిధిలోని రైస్ మిల్లుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బీజేపీ నాయకులు సోమవారం బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సిందే కపిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.

బ్లాక్ లిస్టులో ఉన్న డిఫాల్ట్ రైస్ మిల్లులకు సైతం అధికారులు ధాన్యం కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు రైస్ మిల్లులు, గోదాములను తనిఖీ చేయడం లేదని విమర్శించారు. వెంటనే విజిలెన్స్ అధికారులతో రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు నిర్వహించి సమగ్ర తనిఖీలు చేపట్టాలని అక్రమాలకు పాల్పడుతున్న మిల్లులపై కఠిన చర్యలు తీసుకుని వారి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.