సీట్లపై త్వరలో క్లారిటీ?

06-10-2026 | 02:46pm

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మంగళవారం సమావేశమై ఎన్నికల వ్యూహంపై చర్చించారు. మంత్రి నారా లోకేశ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉండవల్లిలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు, మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పంపకం తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత కూటమి పార్టీలన్నీ సమన్వయంతో ముందుకెళ్లాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో(Local body elections) టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి పనిచేయాలని చంద్రబాబు, పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సీట్ల పంపకంపై చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్(BJP State President PVN Madhav) త్వరలో చంద్రబాబును కలిసే అవకాశం ఉంది.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 175 స్థానాలకు గాను 164 సీట్లు గెలుచుకుంది. ఇందులో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాలు సాధించాయి. ఇదిలా ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలని అక్టోబర్‌ 1న ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

మరిన్ని వార్తలు