రెవెన్యూ అబ్కారీ విద్యుత్ ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం
మండల సమావేశంలో అధికారులపై సర్పంచుల గరం గరం
రెవెన్యూ సర్టిఫికెట్ల జాప్యంపై ఆందోళన
కల్లు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
50 పడకల ఆసుపత్రి, కోర్టు ఏర్పాటుపై ప్రతిపాదనలు
దోమకొండ,(విజయ క్రాంతి): ఆప్కాఅబ్కారీ రి రెవిన్యూ ఎక్సైజ్(AAPCO Excise Revenue Excise) విద్యుత్ శాఖల అధికారులపై దోమకొండ మండల సమావేశంలో సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమకొండ మండల పరిషత్(Domakonda Mandal Parishad)లో శుక్రవారం మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా శాఖల పరిధిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సర్పంచులు కోరారు.
విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో స్థానికంగా ఏఈ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు సర్పంచులు తెలిపారు. గొట్టిముక్కుల సర్పంచ్ సంజీవ్ మాట్లాడుతూ గ్రామంలో తొమ్మిది విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకోసం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాల సమస్యలు ఉన్నాయని తెలిపారు. సంగమేశ్వర్ సర్పంచ్ శ్రీనివాస్రావు గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులకు సంబంధించిన సర్‌చార్జీల సమస్యను పరిష్కరించాలని కోరారు.
మండలంలోని కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, కల్తీ కల్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారనీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులను నిలదీశారు. గ్రామాల్లో కల్లు దుకాణాల నిర్వహణ, నిబంధనల అమలుపై ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సర్పంచులు కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్లు దుకాణాల విషయంలో ఫిర్యాదులు చేసినప్పటికీ ఎక్సైజ్ అధికారులు స్పందించడం లేదని కొందరు సర్పంచులు ఆరోపించారు.
ఎంఆర్వో స్వప్న దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలం ఏర్పాటుకు సంబంధించి వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లుతో చర్చించి అవసరమైన ఏర్పాట్లకు త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయస్థానం ఏర్పాటుకు ప్రతిపాదనలు కోరినట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటరు జాబితా సవరణలకు నోటీసులను అందజేస్తున్నట్లు తెలిపారు. సవరణల కోసం ఫారం 6, 7, 8 అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సంగమేశ్వర్ సర్పంచ్ శ్రీనివాస్ రావు ప్రభుత్వ భూములను రీసర్వే చేయాలని ఎంఆర్వోను కోరారు.
గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌కు సంబంధించి గత పదేళ్లుగా అధికారులు, సర్పంచులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దేవాలయ భూముల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ కార్యాలయంలో వివిధ సర్టిఫికెట్ల జారీకి ఎక్కువ సమయం పడుతోందని సర్పంచులు తెలిపారు. అంచనూర్ సర్పంచ్ జనగామ నరేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలని కోరారు. అంగన్వాడీ టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయగా అర్హులు దరఖాస్తు చేసుకున్నారని వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.
గర్భిణులకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పోషకాహారం అందిస్తున్నామని, ఆరు నెలల నుంచి పిల్లలకు ప్రతిరోజూ గుడ్డు, పౌష్టికాహారం, బాలామృతం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సంగమేశ్వర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయించినప్పటికీ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు, విధివిధానాలు స్పష్టంగా లేకపోవడంతో నిర్మాణం చేపట్టలేకపోతున్నామని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, జ్వరాలు, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోందన్నారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో రోజుకు 400కు పైగా ఓపీ నమోదవుతోందని తెలిపారు. స్త్రీలకు సంబంధించిన వైద్య సేవల కోసం మహిళా వైద్యురాలు, ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. అవసరమైన వైద్య సిబ్బంది, నిపుణుల నియామకం జరిగితే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.గ్రామాల్లో నెలకొన్న సమస్యలను శాఖల వారీగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచులు కోరారు.