రంపచోడవరంలో భోగి యాక్షన్
ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్నారు స్టార్ హీరో శర్వానంద్. ఆయన మరో పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ కోసం బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నందిని తొలిసారిగా చేతులు కలిపిన సంగతి తెలిసిందే. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 1960లో ఉత్తర తెలంగాణ-, మహారాష్ట్ర సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఓ వాస్తవ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనేది ఈ సినిమా ఉప శీర్షిక కాగా ఈ సినిమా కోసం శర్వా ఇప్పటికే సరికొత్తటా ట్రాన్స్‌ఫర్మేట్ అయ్యారు. ఈ చిత్రంలో అను పమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తుండగా, రోహిత్ పాఠక్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం అత్యంత కీలకమైన, భారీ షెడ్యూల్‌ను రాజమండ్రిలో ప్రారంభించింది.
ఇక్కడి రంపచోడవరం అడవుల్లోని సవాలుతో కూడిన ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ టఫ్ యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తుండగా, ప్రధాన తారాగణంతోపాటు శర్వానంద్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ సినిమా నిర్మాణంలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని టీమ్ తెలిపింది.
రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: కిషోర్ కుమార్ ఆరోకియా; స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్; ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె; నిర్మాత: కేకే రాధామోహన్; రచన, దర్శకత్వం: సంపత్ నంది.






