28 May, 2026 | 2:36 AM

బైకులు, మేకల దొంగల అరెస్ట్

28-05-2026 01:56 AM

7 బైకులు, కారు స్వాధీనం

చిట్యాల, మే 27 : విలాసవంతమైన జీవితం కోసం బైకులు, మేకల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగతో పాటు అతనికి సహకరిస్తున్న ఓ మైనర్ బాలుడిని నార్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.20 వేల నగదు, 7 మోటార్ సైకిళ్లు మరియు దొంగతనాలకు ఉపయోగించిన బ్రీజా కారును స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి తెలిపారు. డీఎస్పీ వివరాల ప్రకారం, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లాలో పెరుగుతున్న బైక్, పశువుల దొంగతనాలపై నార్కట్పల్లి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం నార్కట్పల్లి గ్రామ శివారులోని నల్లగొండ రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో నంబర్ ప్లేట్ లేని హీరో ప్యాషన్ ప్రో బ్పై వస్తున్న ఇద్దరిని ఆపి విచారించగా, ఆ బైక్ గత నెలలో అమ్మనబోలు గ్రామానికి చెందిన జటంగి మహేష్ ఇంటి ముందు నుంచి దొంగిలించబడినట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గువ్వల శబరీష్ (29)తో పాటు ఓ మైనర్ బాలుడు ఉన్నట్లు తేలింది.

నిందితుడు శబర్పీ నల్లగొండ జిల్లాలో 18 కేసులు, ఇతర రాష్ట్రాల్లో 3 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సులభంగా డబ్బు సంపాదించాలని భావించి, హైదరాబాద్లో బ్రీజా కారును అద్దెకు తీసుకుని గ్రామాల్లో రేకీ నిర్వహించేవారని చెప్పారు. రాత్రివేళల్లో మేకలు, గొర్రెలను దొంగిలించి గుంటూరు జిల్లా నల్లపాడు సంతలో విక్రయించేవారని వెల్లడించారు.అలాగే ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకులను తాళాలు విరగ్గొట్టి దొంగిలించి, ఫేక్ నంబర్ ప్లేట్లు అమర్చి విక్రయించేవారని తెలిపారు.

విచారణలో నార్కట్పల్లి, దేవరకొండ, కొండమల్లేపల్లి, నల్లగొండ రూరల్, అచ్చంపేటతో పాటు నెల్లూరు ప్రాంతాల్లో జరిగిన పలు బైక్, మేకల దొంగతనాల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కేసును ఛేదించిన నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్‌ఐ విష్ణుమూర్తి, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబు, సాయిలను జిల్లా ఎస్పీ అభినందించారు.