విద్యార్థుల జీవితాలతో ఆటలువద్దు
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
బీజేపీ ఆధ్వర్యంలో ‘చలో అసెంబ్లీ’
నేతల అరెస్టు.. ఉద్రిక్తం
రాజేంద్ర నగర్ సెప్టెంబరు 7(విజయ క్రాంతి): రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నాయి.పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీజేపీ నేతలు మండిపడ్డారు.
విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.పోలీసుల అరెస్టులు:ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తొకల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కిస్మత్పూర్ 122వ డివిజన్ బండ్ల గూడా జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ నీరుడు పవన్ సాయి తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొని ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. చలో అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో నీరుడు పవన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసిస్తే అరెస్టులా?
శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థుల సమస్యలపై నిరసన తెలుపుతున్న నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ఉద్యమాలను అణచలేరని, సమస్యలు పరిష్కారం కావని హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం మానుకుని, ఇప్పటికైనా ప్రభుత్వం వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని, పెండింగ్ బకాయిలన్నింటినీ ఒకే విడతలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
