రాయినిగూడెం పీహెచ్‌సీని 24 గంటల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి

03-10-2026 | 05:54pm

గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందే వరకు బీజేపీ పోరాటం

ములుగు, అక్టోబర్ 3 (విజయక్రాంతి) ; ములుగు మండలంలోని(Mulugu Mandal) రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో(Rayinigudem Primary Health Centre) నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు శనివారం పీహెచ్‌సీని సందర్శించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు(Medical Services), సిబ్బంది అందుబాటు, మందుల లభ్యత తదితర అంశాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జినుకల కృష్ణాకర్ రావు, మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు మాట్లాడుతూ రాయినిగూడెం పీహెచ్‌సీ చుట్టుపక్కల ఉన్న అనేక గిరిజన గ్రామాల ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉందని, అయితే ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వైద్యులు రోస్టర్ విధానంలో విధులు నిర్వహించడం, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం, సిబ్బంది పరిమిత సమయానికే విధులు నిర్వహించడం వంటి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

పర్మినెంట్ వైద్యుడిని, సిబ్బందిని కూడా కూడా 24 గంటలు అక్కడ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు అత్యవసర సమయంలో వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని  అన్నారు. రాయినిగూడెం పీహెచ్‌సీలో 24 గంటల వైద్య సేవలు అందించే విధంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందిని నియమించాలని, ఫార్మసిస్ట్‌ను నియమించి అన్ని రకాల అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాయినిగూడెం పీహెచ్‌సీని 24 గంటల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, అత్యవసర వైద్య సేవలు అందించే స్థాయికి తీసుకురావాలని కోరారు. ప్రజా ఆరోగ్య సమస్యలపై బీజేపీ నిరంతరం ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రాయినిగూడెం పీహెచ్‌సీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించకపోతే మరోసారి పీహెచ్‌సీని సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని, సమస్యలు పరిష్కారం కాకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి లకావత్ రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు లింగంపల్లి రవీందర్ రావు, కార్యదర్శి గుండవైన శ్రీహరి గౌడ్, కిసాన్ మూర్ఛ మండల అధ్యక్షులు జితేందర్ రావు, యువ మోర్చా మండల అధ్యక్షులు రాయపురం అనిల్, నాయకులు కట్టయ్య, మమన్, ప్రసాద్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు