మాపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం

11-09-2026 | 12:55pm

రాజకీయ నాయకులకు క్యారెక్టర్ ముఖ్యం

ప్రజల్లో మా కుటుంబానికి సుదీర్ఘ చరిత్ర ఉంది

మంథని లో బీజేపీ నేత చంద్రుపట్ల సునీల్ రెడ్డి హెచ్చరిక

మంథని, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాజకీయాల్లో ఉన్నవారికి వ్యక్తిత్వమే ప్రధానమని, కొందరు నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ఎదుటివారిపై అసత్య ప్రచారాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు(BJP State Executive Committee Members), పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంథని బిజెపి పార్టీ కార్యాలయంలో  శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాసేవలో తమ కుటుంబానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని గుర్తుచేశారు. సీఎన్ రెడ్డి, నారాయణ రెడ్డి వంటి పెద్దల సిద్ధాంతాలను, విలువలను ఆదర్శంగా తీసుకుని నడుస్తున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తూ, సేవాభావంతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. సమాజ హితం కోసం 10 ఎకరాల భూమిని గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాల నిర్మాణం  కోసం,  భూమిని దేవాలయ నిర్మాణం కోసం విరాళంగా అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

నిరుద్యోగ యువతకు(Unemployed youth) అండగా నిలవడానికి జాబ్ మేళాలు నిర్వహించామని, బ్యాంకులు, ఆసుపత్రుల ఏర్పాటుకు తోడ్పాటునందించడంతో పాటు గోదావరి వరదలు, కరోనా వంటి విపత్కర సమయాల్లో ప్రజలకు నిరంతరం అండగా నిలిచి సేవలందించామని వివరించారు.  ఎదుటివారిపై వ్యక్తిగత దూషణలు, బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని ఆయన గట్టిగా హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సబ్బని సంతోష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సామంతుల అశోక్, భూసారపు తిరుపతి, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ ఎడ్ల సాగర్, మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు బొల్లింపల్లి లక్ష్మణ్, అయిటి మల్లేష్, కార్యదర్శి పార్వతి విష్ణు, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుడ్ల గురుతేజ్, మండల ఉపాధ్యక్షులు ఎలవేని సమ్మయ్య, నాయకులు సాయి, శ్రీకాంత్, చందు, కొలక నరసయ్య, కెర్రె నాగయ్య, సోమారం సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు