3 September, 2026 | 11:52 PM

'22ఏ' తొలిగించే వరకు పోరాటం

03-09-2026 | 11:14pm

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ 

రైతులు, భూ యజమానుల హక్కుల పరిరక్షణకు బీజేపీ పోరాడుతుందని ప్రకటన 

ఎల్బీనగర్: తెలంగాణ రాష్ట్రంలో 22-A జాబితా కారణంగా రైతులు(Farmers), ప్లాట్ యజమానులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender)  నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీజేపీ(BJP) మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి(Former Corporator Kallem Navajivan Reddy), లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హయత్‌నగర్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ డివిజన్లతోపాటు పరిసర ప్రాంతాల్లో 22-A కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువచ్చారు.

చాలా కాలంగా తమ సొంత భూములపై హక్కులు ఉన్నప్పటికీ, 22-A జాబితాలో భూములు ఉండటంతో రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు, ఇతర భూ లావాదేవీల(Land transactions) విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని సమావేశంలో వివరించారు. ప్రైవేట్ పట్టా భూములు, రైతుల భూములు, ప్లాట్ యజమానుల ఆస్తులు అనవసరంగా 22-A పరిధిలో ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, నిజమైన భూ యజమానుల హక్కులను కాపాడే విధంగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ప్రజల ఆస్తి హక్కులకు భంగం కలగకుండా, 22-A సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు అవసరమైన చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకునే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు.  రైతులు, భూ యజమానులు, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతర పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ చార్జి సామ రంగారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.