సీఈసీ ఎంపికలోనే బీజేపీ కుట్ర

26-09-2026 | 05:10am

సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా సీఈసీ రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోందని, బీజేపీ(BJP) తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన్ను ఆ పదవిలో కూర్చోబెట్టిందని ఆరోపించారు.

గతంలో సీఈసీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సభ్యుడిగా ఉన్న కమిటీ ఎంపిక చేసే సాంప్రదాయం ఉండేదని చామల గుర్తుచేశారు. అయితే, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ కావాలనే సీజేఐని ఆ ప్రక్రియ నుంచి తప్పించా రని విమర్శించారు. సెలెక్షన్ ప్రాసెస్ నుంచే ఎన్నికల కమిషనన్‌ను బీజేపీ తమ ఆధీనంలో పెట్టుకుందని మం డిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తొలగించే కుట్ర జ్ఞానేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతోందని ఆరోపించారు.

ఫామ్ 6 ద్వారా దేశవ్యాప్తంగా ఏకంగా 13కోట్ల ఓట్లను తొలగించారని, వారికి తిరిగి ఓటు హక్కు పొందే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. హర్యానా ఎన్నికల వివాదంలో రాహుల్‌గాంధీ సీసీటీవీ ఫుటేజ్ అడిగినా ఇవ్వకుండా ఎందుకు దాచారని ప్రశ్నించారు. అలాగే కర్ణాటకలోని మహదేవపురలో లక్షకు పైగా బల్క్ ఓట్లను నమోదు చేసి, ఫొటోగ్రాఫ్‌లను మార్చేశారని మండిపడ్డారు.

దేశంలోఎప్పటికీ తమదే అధికారం కొన సాగాలని మోడీ, అమిత్ షా భ్రమపడుతున్నారని, దీనికోసం సెక్యులర్ దేశాన్ని భ్రష్టు పట్టించారని చామల ధ్వజమెత్తారు. ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల తొలగింపు ప్రక్రియను నిలిపివేయాలని, ఇటీవల జరిగిన ఎన్నికలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని పరి రక్షించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు