బీజేపీ గెలుపు.. ప్రగతికి మలుపు

26-04-2024 01:58:41 AM

l మోదీ పాలనలో దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం

l మన విద్యార్థుల కోసం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ఘనత మోదీజీది..

l కరీంనగర్‌లో రోడ్ షోలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయి పటేల్

l బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాణేనికి బొమ్మాబొరుసు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కరీంనగర్, ఏప్రిల్ 25 (విజయకాంతి): లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని, ఆ గెలుపు ప్రగతికి బాటలు వేస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయి పటేల్ అన్నారు. కరీంనగర్‌లో గురువారం ఆయన  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌తో కలెక్టరేట్‌లో నామినేషన్ వేయించారు. అనంతరం పార్టీ శ్రేణులతో నగరంలో నిర్వహించిన రోడ్ షోలో గుజరాత్ సీఎం మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలోని సూరత్ లోక్‌సభ స్థానం ఇప్పటికే బీజేపీకి ఏకగ్రీవమైందన్నారు. పార్టీ 400 సీట్ల టార్గెట్‌కు ఇంకా 399 సీట్లు సాధించాల్సి ఉందన్నారు. ప్రజలు ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని, ఇక అభివృద్ధి సంగతి ప్రధానిగా మోదీ చూసుకుంటారన్నారు. మోదీ పాలనలో భారత్ గౌరవం అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందన్నారు.

భారత్ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ ఏకంగా రష్యా- యుద్ధాన్ని ఆపారని గుర్తుచేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను చూసిన తరువాత బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఇక ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల ఆశీస్సులు బీజేపీకే ఉన్నాయన్నారు. ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారన్నారని జోస్యం చెప్పారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్‌లోకి పంపి రాజకీయం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాణేనికి బొమ్మాబొరుసులాంటివన్నారు. ఎన్నికల్లో తెలంగాణలో 17కు 17 సీట్లు బీజేపీనే దక్కించుకుంటుం దని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ ప్రజల కోసం జైలుకు వెళ్లిన నాయకుడన్నారు. ప్రజలకు గడీల వారసులు కావాలో? గరీబోళ్ల బిడ్డ కావాలో? తేల్చుకోవాలన్నారు.

-కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు 

వందల కోట్లు ఉన్నోళ్లు: బండి సంజయ్

బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘-కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు వందల కోట్ల రూపాయలు ఉన్నోళ్లు. వాటిని చేయడానికి ఎన్నికల్లోకి వచ్చినోళ్లు. వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదించుకుంటారు. నాకు వాళ్లలాగా కోట్ల ఆస్తుల్లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కొట్లాడింది. నేను, అగ్రవర్ణాల పేదల కోసం పోట్లాడింది నేను. కానీ మీ కోసం కొట్లాడి వందల కేసులు మీద వేసుకున్నోడిని. నా ఆస్తి మీరే. గడీల వారసులు కావాల్నా? గరీబోళ్ల బిడ్డనైన నేను కావాలా? భారత్‌ను ప్రపంచంలో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ కష్టపడుతున్నారు. మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు ప్రజలు బీజేపీకి ఓటు వేయాలి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు నాన్ లోకల్. నేను లోకల్. వందల కోట్లు ఖర్చు పెట్టి టికెట్ తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనాడైనా పార్టీ జెండాలు మోశాడా? ప్రజల పక్షాన పోరాడారా? మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తన్నుడు.. గుద్దుడు.. తప్ప మరోభాష రాదు’ అన్నారు.

నాగర్ కర్నూల్‌లో ‘కార్నర్ మీటింగ్’

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో గుజరాత్ సీఎం భూపేంద్రభాయి పటేల్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌కుమార్ గెలుపు కోసం ‘కార్నర్ మీటింగ్’ నిర్వహించారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలంటే ప్రజలు ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. ధరల నియంత్రణలో ప్రధాని మోదీ చురుకైన పాత్ర పోషించారని  కొనియాడారు. రక్షణరంగంలోనూ దేశాన్ని ముందంజలో నిలిపారన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమూ వంద రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకతను సాధించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా సంపూర్ణంగా పూర్తి చేయలేదన్నారు. ఎంపీ అభ్యర్థి భరత్‌కుమార్ మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చి ప్రజలు ఎన్నికల్లో గెలిపిస్తే ఎంపీగా ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. సమావేశంలో ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు, నాయకులు ఆచారి, దిలీప్‌చారి పాల్గొన్నారు.