యువత తలుచుకుంటే సివిల్స్ సులభమే

26-04-2024 01:58:55 AM

ఇన్‌స్పైర్ కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్

హైదరాబాద్, ఏప్రిల్ 25, (విజయక్రాంతి): యువత తలుచుకుంటే సివిల్ సర్వీ సెస్ సాధించటం పెద్ద విషయమేమీ కాదని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో గురువారం నిర్వహించిన ఇన్‌స్పైర్ 2024 అనే పేరుతో బీసీ స్టడీ సర్కిల్ విధ్యార్థులకు పోటీపరీక్షల్లో విజేతలతో ముఖాముఖీని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్.. సివిల్ సర్వీసెస్ విజేతలను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. స్టడీ సర్కిల్ విద్యార్థులు ఎలా విజయం సాధించాలో పలు సూచన లు చేశారు. ముందు తరాల నుంచి జ్ఞానాన్ని అందించడమే ప్రధాని మోదీ ప్రవచించిన ఆత్మనిర్భర్ భారత్ అని పేర్కొన్నారు.

అది మన సనాతన సంప్రదాయ మూలాల్లోనే ఉందన్నారు. జీవితంలో ఎలాంటి అడ్డంకు లు లేకుండా గెలిస్తే అది అసలైన విజయం కాదని వివేకానందుడి సూక్తిని గుర్తుతెచ్చుకోవాలన్నారు. అందుకు తన జీవితమే ఒక ఉదాహరణ అని తెలిపారు. ‘కోయంబత్తూర్‌లో రెండుసార్లు గెలిచా. తర్వాత మూడు సార్లు ఓడిపోయా. గతంలో కాయిర్ బోర్డ్ చైర్మన్‌గా పని చేసినప్పుడు పర్యావరణహిత కాయిర్‌ను ఆవిష్కరించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఈ విషయాన్ని తమిళ విశ్వవిద్యాలయలో కేస్ స్టడీగా తీసుకున్నా రు’ అని తెలిపారు. ఈ సందర్భంగా గెలుపు పిలుపు అనే స్వీయరచిత పుస్తకాన్ని స్టడీ సర్కిల్ విద్యార్థులకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం బహూకరించారు.