7 August, 2026 | 5:30 PM

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు

07-08-2026 04:51 PM

గణపురం,(విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బోనాల పండుగను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేసు సతీష్ కుమార్, పీడీ కోసరి సరిత ఆధ్వర్యంలో శుక్రవారం ఈ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థినులు తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో బోనం ఎత్తుకుని పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు పోతురాజు వేషధారణలో చేసిన విన్యాసాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు దేసు సతీష్ కుమార్ మాట్లాడుతూ... విద్యార్థులకు చదువుతో పాటు తెలంగాణ పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ జీవన విధానంలో బోనాల పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భరత్ కుమార్, కుమారస్వామి, శకీరా బేగం, రాంబాబు, రమేష్, శ్రీనివాస్, దేవేందర్, దిల్షాద్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.