23 June, 2026 | 1:05 AM

సుంకాల పోటుకు సిద్ధం

23-06-2026 12:00 AM
  1. దేశాలపై ట్రంప్ టార్గెట్
  2. జూలై 10 తర్వాత కొన్ని దేశాలపై ఎక్కువ.. మరికొన్నింటిపై తక్కువ

వాషింగ్టన్, జూన్ 22: ప్రపంచం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రపంచ వాణిజ్యంపై పగబడుతూ.. సరికొత్తగా మరో రెండు పన్నులను వేసేందుకు రెడీ అయినట్లు కన్పిస్తున్నారు. జూలై 10 తర్వాత కొన్ని దేశాలపై ఎక్కువ.. మరికొన్నింటిపై తక్కువ సుంకాలను బాదేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఆయన విధించిన సుంకాలు చెల్లుబాటు కావని ఆ దేశ సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రపంచ దేశాలపై పన్నులు విధించేందుకు మరో రెండు సరికొత్త ఆయుధాలను సిద్ధం చేశారు. వీటిల్లో ఒకటి వెట్టిచాకిరీ చేయించే దేశాల జాబితా కాగా.. మరొకటి అదనపు పారిశ్రామిక సామర్థ్యం. చౌకగా అందుబాటులో ఉండే కార్మికులను, పరిశ్రమలను వాడుకుని భారీగా ఉత్పత్తి చేయగలిగే దేశాలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపించనుంది. అమెరికా అధ్యక్షుడికి చట్టపరమైన అధికారం ఉన్న ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301ని అగ్రరాజ్యం ఆయుధంగా చేసుకోనుంది. ఇప్పటికే ట్రంప్ విధించిన 10శాతం పన్నుల గడువు జూలై 10వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత కొన్ని దేశాలపై టారిఫ్‌లు ఎక్కువగా.. మరికొన్నింటిపై తక్కువగా ఉంటాయి.

అమెరికాతో వాణిజ్యానికి సంబంధించి ఇప్పటికే భారత్ తాత్కాలిక ఒప్పందంపై సంతకాలు చేయగా.. బ్రిటన్, ఐరోపా సమాఖ్య, దక్షిణ కొరియా, యూకే వంటి దేశాలు ట్రేడ్ డీల్స్ చేసుకున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్స్‌పై పన్నులు తగ్గించేందుకు వీటిల్లో చాలా దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ తీసుకురాబోయే కొత్త పన్నుల ప్రభావం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు భారత్ తో పూర్తిస్థాయి వాణిజ్య చర్చలు చివరి దశకు చేరుకోవడంతో అమెరికా ప్రతినిధి జెమీసన్ గ్రీర్ నేడు న్యూఢిల్లీకి చేరుకొన్నారు. ఈ సందర్భంగా సుంకాలపై ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.