1 July, 2026 | 2:29 PM

ఆశ్రమ పాఠశాలలో 'లేట్ ఫీజు' వసూళ్ల కలకలం

30-06-2026 09:08 AM

డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ విద్యార్థి తండ్రి ఆగ్రహం

విచారణకు ఆదేశిస్తామని జీసీడీఓ శకుంతల హామీ

బెజ్జూర్, జూన్ 30 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో(Ashram Schools for Tribal Girls) విద్యార్థుల నుంచి 'లేట్ ఫీజు' పేరుతో నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువడడంతో వివాదం నెలకొంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.విద్యార్థి తండ్రి సుధాకర్ తన కుమార్తె వద్ద రూ.200 లేకపోవడంతో డబ్బులు ఎందుకు చెల్లించాలని వార్డెన్‌ను ప్రశ్నించినట్లు తెలిపారు. దీనికి స్పందించిన వార్డెన్ శ్రీనివాస్, విద్యార్థులు సమయానికి పాఠశాలకు రావాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని తీసుకుంటున్నామని, ఆశ్రమ పాఠశాల అవసరాలకే వినియోగిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే వంద మందికి పైగా విద్యార్థుల నుంచి ఈ విధంగా డబ్బులు వసూలు చేసినట్లు, అందుకు సంబంధించిన నమోదును కూడా తమ వద్ద ఉంచినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు.ఆరోపణలపై వార్డెన్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా విద్యాసంవత్సరం ప్రారంభమై 15 రోజులు గడిచినా కొంతమంది విద్యార్థులు సమయానికి రావడం లేదని, వారిలో క్రమశిక్షణ పెంపొందించేందుకే లేట్ ఫీజు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంపై గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి (జీసీడీఓ) శకుంతలను సంప్రదించగా, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి 'లేట్ ఫీజు' పేరుతో డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తోందని, పాఠశాల అవసరాల పేరుతో డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదన్నారు. ఈ ఘటనపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.