సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నిరసన
రాజేంద్ర నగర్ సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా పోలీసులు అనాగరికంగా, దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నిరసనలో భాగంగా హైదర్షాకోట్ ఎక్స్ రోడ్డులోని ఫైమిష్ కేఫ్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సమాజంలో మహిళలకు కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ శాసనసభ సాక్షిగా మహిళా ఎమ్మెల్యే ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని మండిపడ్డారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, బాధ్యులైన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు రవీందర్ రెడ్డి, తలారి పండు, రాముడు యాదవ్, నవీన్ ముదిరాజ్, సంతోష్ గౌడ్, మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఇస్మాయిల్, చంద్రశేఖర్, శామ్యూల్, ఇంతియాజ్, రాజ్‌కుమార్ సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
