మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం
నారా భువనేశ్వరి
షాద్నగర్, మార్చి 8 (విజయక్రాంతి): మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం నాగులపల్లిలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పాడి మహిళా రైతుల ముఖాముఖి మరియు పశువైద్య శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన భువనేశ్వరి మాట్లాడుతూ.. గత 34 ఏళ్లుగా హెరిటేజ్ సంస్థ సాధించిన విజయాల్లో 50 శాతం వాటా మహిళలదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం సంస్థకు మహిళా రైతులు ప్రతిరోజూ సుమారు 3 లక్షల లీటర్ల పాలను అందజేస్తున్నారని ఆమె వెల్లడించారు. మహిళల్లో ఉండే నాయకత్వ లక్షణాలు, మేనేజ్మెంట్ సామర్థ్యం పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని కొనియాడారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు.
మహిళల భద్రత అనేది కేవలం మాటలకే పరిమితం కాకూడదు. ఆఘాయిత్యాలకు పాల్పడే వారిలో వణుకు పుట్టేలా కఠిన చట్టాలు అమలు చేయాలన్నారు. మహిళలు నిర్భయంగా తిరిగే వాతావరణం కల్పించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని ఆమె ఆమె పేర్కొన్నారు. రైతులకు అవగాహన ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరంలో నిపుణులు పాడి పశువుల ఆరోగ్యం మరియు నాణ్యమైన పాల ఉత్పత్తిపై రైతులకు మెలకువలు నేర్పించారు. ఈ వేడుకలో హెరిటేజ్ సంస్థ డైరెక్టర్ సంబశివరావు, పాల సేకరణ శాఖాధిపతి రామ్మోహన్ రావు, డాక్టర్ బానోతు శ్రీను, కే.బీ. నర్సింగ్ రావు మరియు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో మహిళా రైతులు పాల్గొన్నారు.




