నత్త నడకన భవన నిర్మాణం పనులు..

28-09-2026 | 07:27pm

ఆరు నెలల నుంచి సాగుతున్న పనులు..

భవన నిర్మాణానికి రూ 20 లక్షలు మంజూరు...

తాడ్వాయి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): గ్రామంలో ఉన్న పాత గ్రామపంచాయతీ భవనాన్ని కూల్చివేయడంతో గ్రామ పంచాయతీకి సరైన భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఉన్న గ్రామ పంచాయతీ భవనం(Gram Panchayat Building) బీటలు వారడంతో అప్పటి పాలకవర్గం ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని కూల్చివేసింది. కొత్త గ్రామపంచాయతీ భవణ నిర్మాణం కోసం సాయ శక్తుల కృషి చేసిన భవన నిర్మాణం రూపు దాల్చలేదు.

కానీ గ్రామ పంచాయతీకి కొత్త పాలకవర్గం ఏర్పాటు అయిన తర్వాత గ్రామ పంచాయతీ భవణ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ భవణ నిర్మాణం పనులు పిల్లర్ల స్థాయిలోనే ఉన్నాయి.అదే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనుల తీరు ఇలా ఉంది.సదరు కాంట్రాక్టర్ పిల్లర్లు నిర్మించి వెళ్లిపోయారు. పూర్తిస్థాయిలో భవనం నిర్మించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.ఆరు నెలలు అవుతున్న నిర్మాణ పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ధర్మశాలలోనే గ్రామపంచాయతీ పాలన... 

గ్రామపంచాయతీకి సరైన భవనం లేకపోవడంతో గ్రామంలోని ధర్మశాలలోనే గ్రామపంచాయతీ పాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీ భవనం లేక తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సదరు పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ సంకు పోచయ్య, ఉపసర్పంచ్ పొద్దుటూరి నవీన్ రెడ్డి, వార్డు సభ్యులు కలిసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు తో మొరపెట్టుకున్నారు.

దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేశారు. కానీ సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెంకుటింట్లో ఉన్న ధర్మశాలలోనే గ్రామపంచాయతీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామపంచాయతీ పాలనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  

నిర్మాణం పనులు వేగవంతం చేయాలి..

గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులు కోరుతున్నారు.ఆరు నెలలు అవుతున్న ఇంకా పిల్లర్ల స్థాయిలోనే ఉండడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత పాలకవర్గంలో గ్రామపంచాయతీ భవనానికి రూ.25 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. కానీ అప్పట్లో కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో పనులు జరగకుండానే నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ప్రస్తుతమైన పనులు వేగవంతం చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు