క్యాబ్‌ డ్రైవర్‌ అనుమానాస్పద మృతి

12-09-2026 | 10:51pm

బేగంపేటలో ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి

రుద్రారం చెరువు వద్ద మృతదేహం

పటాన్ చెరు: హైదరాబాద్‌ బేగంపేటలో క్యాబ్‌ డ్రైవర్‌(Cab driver)గా పనిచేస్తున్న రాజశేఖర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కారులో విధులకు వెళ్లిన ఆయన శుక్రవారం వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన భార్య లీల బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజశేఖర్ సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 5 గంటల వరకు విధులు ముగించుకుని, ఉదయం 6 గంటలలోపు ఇంటికి చేరుకునేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

ఇదిలా ఉండగా, ఆయన కారు బుదేరా నుండి కోహిర్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి(National Highway) పక్కన ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో రుద్రారం చెరువు వద్ద రాజశేఖర్ మృతదేహం ఉన్న విషయాన్ని పటాన్‌చెరు పోలీసులు ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు, ఘటన ఎలా జరిగిందనే విషయాలు ఇంకా తెలియరాలేదు. రాజశేఖర్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడింది ఎవరు? ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. తన భర్తపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని భార్య లీల తెలిపారు.

మరిన్ని వార్తలు