కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు
- లిక్కర్ కేసులో 16న విచారణకు హాజరు కావాలని సూచన
- విచారణకు సహకరిస్తా: కవిత
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. కవితతోపాటు అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్‌రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డిలకు ఢిల్లీ మద్యం కే సుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఈ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు క్లీన్‌చిట్ ఇచ్చిన్నప్పటికీ, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలోనే సీబీఐ అధికారులు మళ్లీ రంగంలోకి దిగడం గమనార్హం. వెలుగుమట్ల బాధితుల పక్షాన దీక్ష చేసిన కవిత అనారోగ్యంతో ఉండటంతో ఆమె భర్త అనిల్‌కుమార్‌కు సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 16వ తేదీన ఢిల్లీ హై కోర్టులో విచారణకు హాజరు కావాలని అధికారులు సూచించారు.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నోటీసులు ఇవ్వడం పట్ల జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు తెలిపారని. సీబీఐ నోటీసులపై మా లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.




