రూ.38 లక్షలతో సీసీ రోడ్లకు శ్రీకారం..
ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి కష్టాలకు తెరపడుతోంది.. గుంతలు, బురదతో ఇబ్బందులు పడుతున్న మూడో వార్డు ప్రజలకు ఊరట కలిగేలా రూ.38 లక్షల నగర అభివృద్ధి నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాలతో చేపట్టిన ఈ పనులతో వార్డులో రాకపోకల కష్టాలు తొలగి మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి.
రామాయంపేట, సెప్టెంబర్ 21:(విజయ క్రాంతి): రామాయంపేట మున్సిపాలిటీ(Ramayampet Municipality) పరిధిలో అభివృద్ధి పనులకు వేగం పెరిగింది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ప్రాధాన్యత క్రమంలో కల్పించడంలో భాగంగా మూడో వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం మున్సిపల్ పాలకవర్గ సభ్యులు శంకుస్థాపన చేశారు. నగర అభివృద్ధి నిధుల నుంచి సుమారు రూ.38 లక్షలు వెచ్చించి ఈ పనులను చేపడుతున్నట్లు కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, గుగులోత్ రవి నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామాయంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలకవర్గం ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ, పట్టణంలో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రోడ్లు బాగుంటేనే ప్రజల జీవనం సులభమవుతుందని, అందుకే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మూడో వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగి, ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని చెప్పారు.
రామాయంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కౌన్సిలర్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అత్యవసరమైన పనులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎం. యాదగిరి, చింతల యాదగిరి, దాకి స్వామి. పుట్టి సందీప్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.