15 April, 2026 | 3:16 AM

దక్షిణాదికి అన్యాయం?

15-04-2026 12:00 AM

దేశంలో లోక్‌సభ స్థానాల పునర్విభజనకు (డీలిమిటేషన్) రంగం సిద్ధమైంది. డీలిమిటేషన్ ప్రక్రియ అమలు దిశగా కేంద్రప్రభుత్వం అడుగులు వేసింది. పార్లమెంట్‌లో ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.

ప్రతిపాదిత బిల్లు ప్రకారం రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 815కి, కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్థానాలు 35కి పెరుగనుండటం గమనార్హం. ఈ మేరకు ఏప్రిల్ 16న నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. తద్వారా ఇప్పటివరకు డీలిమిటేషన్‌కు అడ్డంకిగా ఉన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 82కి సవరణ చేయనున్నారు. పెరుగనున్న లోక్‌సభ సీట్లలో 33 శాతం మహిళలకు కేటాయించేలా ప్రత్యేకంగా ప్రతిపాదిం చినట్టు తెలుస్తున్నది.

వాస్తవానికి ఆర్టికల్ 82 ప్రకారం 2026 తర్వాత జరుగనున్న తొలి జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. అయితే, జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దక్షిణాది సీట్ల అవసరం లేకుండానే, హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన రాజకీయ పార్టీ సులువుగా కేంద్రంలో అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటుంది. అదే జరిగితే పార్లమెంట్‌లో దక్షిణాది గొంతు మూగబోతుంది.

అందుకే జనాభా ఆధారిత నియోజక వర్గాల పునర్విభజనను దక్షిణాది రాష్ట్రాలు మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభాను నియంత్రించడమే కాకుండా ప్రగతిలో పరుగులు పెడుతూ, దేశాభివృద్ధికి తోడ్పాడునందిస్తున్న తమను శిక్షించడం సరికాదని కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదికి అన్యాయం జరగదని ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా హామీ ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.

మరోవైపు దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఉండేందుకు రేవంత్‌రెడ్డి హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించారు. రాష్ట్రాల జీఎస్డీపీ ఆధారంగా 50 శాతం, జనాభా ఆధారంగా మరో 50 శాతం సీట్లను పెంచాలని ఆయన సూచించడం గమనార్హం. అయితే, ఈ ప్రతిపాదనను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. కాగా, దక్షిణాది నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మధ్యేమార్గాన్ని అనుసరించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం పార్లమెంట్‌లో రాష్ట్రాలకు ఉన్న ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేలా, అన్ని రాష్ట్రాల్లోని లోక్‌సభ సీట్లతోపాటు అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచాలని ప్రతిపాదించడం దక్షిణాదికి కొంత ఊరట అనే చెప్పాలి.