14 April, 2026 | 2:49 AM

అంబేద్కర్ తొలి ప్రధాని అయ్యుంటే..!

14-04-2026 12:00 AM

1947లో వలస పాలన నుంచి భారత్ విముక్తి పొందినప్పుడు, కేవలం రాజకీయ స్వాతంత్య్రపు దశలోనే కాకుండా, నాగరికతను పునర్నిర్మాణం చేసుకునే అవకాశం అంచున మన దేశం నిలిచింది. అటువంటి కీలక సమయంలో నాయకత్వం పరిపాలననే కాదు, దేశ స్వభావం, భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. నాడు నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయినా, నాడు అత్యంత నిర్మాణాత్మకంగా ఆలోచించిన మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధికారానికి దూరంగా ఉండిపోయారు.

అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్త మాత్రమే కాదు; ఆయన భారత్‌ను సామాజికంగా విభజించబడిన, ఆర్థికంగా అసమానమైన, వ్యూహాత్మకంగా బలహీనమైన దేశంగా, అనేక సంక్లిష్టతలు ఉన్న దేశంగా చూసిన గొప్ప మేధావి. ఆయన విజన్ సాధారణమైనది కాదు. ఒకవేళ ఆయన భారతదేశపు తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినట్లయితే, ఈ దేశం స్వతంత్ర దేశంగా కాకుండా, ఇప్పటికే ఒక గ్లోబల్ శక్తిగా ఎదిగి ఉండేదేమో.

ఎ. స్వతంత్ర భారత్ ఎదుర్కొన్న తొలి, ప్రధాన సవాలు విభజన. చాలా మంది నాయకులు దీనిని ఒక భావోద్వేగపూరితమైన అంశంగానే చూశారు. కానీ, అంబేద్కర్ మాత్రం దీనిని విశ్లేషణాత్మకంగా పరిశీలించారు. తమను తాము వేర్వేరు వర్గాలుగా భావించే రెండు సమాజాలు శాశ్వత ఘర్షణ లేకుండా కలిసిమెలిసి జీవించగలవా? అన్న క్లిష్టమైన ఒక ప్రశ్నను పాకిస్థాన్, విభజిత భారత్ ముందు ఆయన ఉంచారు. పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయాలన్న మహమ్మద్ అలీ జిన్నా డిమాండ్ అంబేద్కర్ దృష్టిలో అనివార్యం మాత్రమే కాదు, అది ఒక అవకాశమూ.

హడావుడిగా, గందరగోళంగా జరిగిన విభజనకు భిన్నంగా దేశ విభజనకు భిన్నంగా రెండు నుంచి మూడు సంవత్సరాల ప్రణాళికలు, కచ్చితమైన సరిహద్దు నిర్ధారణ, జనాభా ఆధారంగా ఆస్తుల విభజనను ప్రతిపాదించేవారు. ముఖ్యంగా, దీర్ఘకా లిక సామాజిక అస్థిరతను నివారించేందుకు గ్రీకు తరహాలో పూర్తిగా జనాభా మార్పిడి అవసరమని ఆయన వాదించారు. ఈ ప్రతిపాదనను అనుసరించి ఉంటే ప్రాణ నష్టం గణనీయంగా తగ్గి ఉండేది.

బి. కశ్మీర్ విషయంలోనూ అంబేద్కర్‌కు స్పష్టమైన ఆలోచనలు ఉండేవి. సంక్లిష్టమైన ఈ అంశంలో రాజీకి బదులుగా మరింత స్ప ష్టత ఉండాలని ఆయన భావించేవారు. జ మ్మూకశ్మీర్‌ను పూర్తిగా రాజ్యాంగం పరిధిలోకి తీసుకొచ్చి, దానికి ఆర్టికల్ 370 వంటి ప్రత్యేక హోదాను తిరస్కరించేవారు. ఫలితంగా దీర్ఘకాలిక అనిశ్చితి, ఈ అంతర్జాతీ యీకరణ లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ సిద్ధాంతం ఒక దేశం, ఒక రాజ్యాంగం, ఒక సార్వభౌమత్వం.

సి. ఆర్థికవేత్తగా, జల నిపుణుడిగా అంబేద్కర్ నదులను జాతీయ శక్తి సాధనాలుగా చూశారు. సింధు జలాలను పూర్తిగా వినియోగించుకునేవారు. తొలినాళ్లలోనే నీటిపా రుదల ప్రాజెక్టులు నిర్మించేవారు. పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ఆధారంగా చేసుకొని జల ఒప్పందాలు చేసుకునేవారు. ఆయన దృష్టిలో నీరు కేవలం వనరు కాదు, ఒక వ్యూహాత్మక ఆస్తి. స్పష్టమైన జాతీయ జల విధానం, నదుల అనుసంధానాన్ని అమలు చేసి ఉంటే, జల వివాదాలు సంభవించేవి కాదు.

డి. టిబెట్ స్వయంప్రతిపత్తి కోల్పోయిన వెంటనే చైనా నుంచి ఒత్తిడి పెరుగుతుందని ఆయన ముందుగానే హెచ్చరించారు. చైనా విస్తరణకు వ్యతిరేకంగా బలమైన దౌత్య చర్యలు చేపట్టడం, టిబెట్ సమస్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, నేపాల్, మయన్మార్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యా లు ఏర్పాటు చేయడం లాంటి కీలక చర్యల ను అంబేద్కర్ తీసుకునేవారు. ఈ వాస్తవిక దృక్పథం ఆ కాలంలోని ఆదర్శవాద విదేశాంగ విధానాలకు విరుద్ధం. ఆయన హిందూ భాయ్ -భాయ్, పంచశీల వంటి భావోద్వేగపూరిత నినాదాలకు లోనుకాకుండా తార్కికంగా వ్యవహరించేవారు.

ఈ. విభజన వల్ల మధ్య ఆసియాతో భారతదేశానికి ఉన్న అనుసంధానం తెగిపోయింది. అంబేద్కర్ దీనిని అంగీకరించేవారు కాదు. ఆయన రవాణా కారిడార్లను ఏర్పాటు చేసి, ఖండాంతర వాణిజ్య మార్గాలతో అనుసంధానాన్ని కొనసాగించేవారు.

ఎఫ్. విభజన సమయంలో కలాత్ అనే సంస్థానం భారత్‌లో విలీనానికి ఆసక్తి చూ పింది. కానీ, నాడు నెహ్రూ నాయకత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించి ఒక వ్యూహాత్మక తప్పిదం చేసింది. ఆ ప్రతిపాదనను అంగీకరించి ఉంటే గ్వాదర్ పోర్ట్‌పై భారత్‌కు పట్టుండేది. అంతేకాదు, ఇరాన్, ఆఫ్గానిస్థాన్‌లతో భూ మార్గం అనుసంధానానికి అవకాశం లభించేది.

జి. సంస్థానాల విలీనంలో పటేల్ విజయం సాధించినప్పటికీ, అంబేద్కర్ ఇంకా వ్యవస్థీకృతమైన చర్యలు చేపట్టేవారు. దేశ సమగ్రతకు విఘాతం కలిగించే రజాకార్లు వంటి శక్తులకు కచ్చితమైన డెడ్‌లైన్‌లు విధించి, వారి ఆటకట్టించేవారు.

హెచ్. గోవా 1961 వరకు పోర్చుగీస్ పాలనలో ఉండటాన్ని అంబేద్కర్ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేవారు కాదు. పోర్చుగ ల్‌కు ఆయన కచ్చితమైన అల్టిమేటం జారీచేసి, అవసరమైతే తక్షణమే చర్యలు తీసు కునేవారు. అంబేద్కర్ దృష్టిలో సార్వభౌమత్వం అనేది రాజీకి అతీతమైనది.

ఐ. ఆర్థికవేత్తగా అంబేద్కర్ ఆర్థిక విధా నం ప్రైవేటు భాగస్వాములతో సమన్వయం చేసుకునే విధంగా ఉండేది. తర్వాతి కాలంలో పి.వి. నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను ముందుగానే సూచించినదిగా ఈ విధానాన్ని చెప్పవచ్చు. భూసంస్కరణలు, పారిశ్రామీకరణ, సంస్థాగత ఆర్థిక ప్రణాళికలు అమలులోకి వచ్చిన ట్లయితే, భారత్ వేగంగా అభివృద్ధి చెందేది.

జె. అంబేద్కర్ దూరదృష్టి ఆర్టికల్ 3లో స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఇది రాష్ట్రాల పు నర్వ్యవస్థీకరణకు వీలు కల్పించింది. ఆయన నాయకత్వంలో పరిపాలనా సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని చిన్న రాష్ట్రాలు ముందుగానే ఏర్పడి ఉండేవి. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు దీర్ఘకాల పోరాటాల అవసరం లేకుండానే అవతరించి ఉండేవి. తెలంగాణ మొదటి నుంచే స్వతంత్ర రాష్ట్రంగా కొనసాగి ఉండేది.

కె. అంబేద్కర్ మహిళా సాధికారతకు కట్టుబడ్డారు. లింగ సమానత్వం కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టడానికి కృషి చేశారు. ఆ బిల్లుకు వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేయ డం సామాజిక న్యాయంపై ఆయనకు ఉన్న అచంచల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

ఎల్. భారత ఐక్యత కోసం శక్తివంతమైన కేంద్రం అవసరమని ఆయన విశ్వసించారు. భారత్‌ను రాష్ట్రాల సమాఖ్యగా నిర్వచించి ఏకత్వానికి ప్రాధాన్యమి చ్చారు.

ఎం. సామాజిక న్యాయపరంగా అంబేద్కర్ రిజర్వేషన్ కంటే ప్రాతినిధ్యాకే ప్రాధాన్యమిచ్చారు.

ఎన్. ఈ దిశగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కమిషన్ కోసం అంబేద్కర్ చేసిన ప్రయత్నాలు ఆయన సమగ్ర దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తాయి.

ఓ. భారత్‌కు రెండో రాజధాని అవసరమని అంబేద్కర్ భావించి, హైదరాబాద్ అం దుకు అనుకూలమైనదిగా గుర్తించారు. ఈ ఆలోచనపై ఇప్పటికీ చర్చ జరుగుతున్నది.

స్థూలంగా చెప్పాలంటే అంబేద్కర్ ఒక సామాజిక సంస్కర్త మాత్రమే కాదు, జాతి నిర్మాణకర్త, ఆర్థికవేత్త, న్యాయవేత్త, వ్యూహకర్త, దేశభక్తుడు కూడా. అయినా ఆయన వారసత్వాన్ని రిజర్వేషన్ల చర్చకే పరిమితం చేసిన దుస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాజ్యాంగ నైతికతపై ఆయనకు ప్రగాఢ విశ్వాసం ఉండేది. అంబేద్కర్ భారతదేశ తొలి ప్రధానిగా ఉండి ఉంటే, ప్రజాస్వామ్యం, భౌగోళిక వ్యవస్థ, ఆర్థిక ప్రగతి వంటివి మరింత సమగ్రంగా, సమన్వయంతో అభివృద్ధి చెందేవని భావించవచ్చు. వారసత్వ రాజకీయాలకు తక్కువ ప్రాధాన్యం దక్కి ఉండేది.

చరిత్ర ఒక మార్గాన్ని ఎంచుకుంది. కానీ, అంబేద్కర్ విజన్ మనకు మరో మార్గాన్ని గుర్తుచేస్తుంది, ఆ మార్గం స్వాతంత్య్రం అంతిమ గమ్యం కాకుండా, శక్తివంతమైన, ప్రపంచానికి దారిదీపమైన భారత్‌కు ఆరంభ బిందువుగా ఉండేది. ఈ నేపథ్యంలో భారత్ ఒక గొప్ప ఆరంభాన్ని, అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు.

 మాజీ ఎంపీ, బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షుడు