చెన్నూరు బస్టాండ్ కంపు కంపు!
ప్రయాణికులకు తప్పని అవస్థలు పట్టించుకోని అధికారులు
చెన్నూర్, సెప్టెంబర్ 27 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని(Chennur town) బస్టాండ్ ఆవరణ ప్రయాణికులకు (passengers)తీవ్ర అసౌకర్యంగా మారుతోంది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో మలమూత్ర విసర్జనతో దుర్వాసన వెదజల్లుతుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బస్సుల కోసం వేచి ఉండాల్సిన ప్రయాణికులు దుర్వాసన మధ్య కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణంలో ప్రజలకు అవసరమైన అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, బస్టాండ్ ఆవరణ మాత్రం కనీస పరిశుభ్రతకు నోచుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ ప్రాంగణం అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యానికి గురవుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
మలమూత్రశాలలు అందుబాటులో ఉన్నప్పటికీ..
బస్టాండ్‌లో మలమూత్రశాలలు ఉన్నప్పటికీ, పరిశుభ్రంగా లేకపోవడంతో కొందరు ప్రయాణికులు వాటిని వినియోగించకుండా బహిరంగంగా మలమూత్ర విసర్జన చేస్తున్నారు. అయితే, అందుబాటులో ఉన్న సౌకర్యాలను ప్రజలు వినియోగించేలా అవగాహన కల్పించడంలో అధికారుల పర్యవేక్షణ ఎంతవరకు ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్టాండ్‌లో ‘ఇక్కడ బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయరాదు’, ‘మలమూత్రశాలలను వినియోగించండి’ అంటూ స్పష్టమైన అవగాహన, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బస్టాండ్ పరిసరాలను నిరంతరం శుభ్రపరిచేలా ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇకనైనా అధికారులు మేల్కొనాలి!
ప్రజారోగ్యానికి, ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించిన అంశాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బహిరంగ మలమూత్ర విసర్జనకు అడ్డుకట్ట వేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బస్టాండ్‌కు వచ్చే ప్రతి ప్రయాణికుడికి పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని, దుర్వాసన మధ్య ప్రయాణించే పరిస్థితికి ఇకనైనా ముగింపు పలకాలని చెన్నూర్ ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.