అర్వపల్లిలో హై టెన్షన్...
కాంగ్రెస్ వర్గాల ఘర్షణ
కర్రలు,రాళ్లతో పరస్పర దాడులు
లాఠీచార్జ్ చేసిన పోలీసులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 08: సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండల(Jajireddygudem Mandal) కేంద్రం అర్వపల్లిలోని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై అసంతృప్తిగా ఉన్న మాజీమంత్రి దామోదర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) వర్గం ఒకవైపు,ఎమ్మెల్యే మందుల సామేలు వర్గం మరోవైపున తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సామేలు ఏకపక్షంగా,ఏఐసీసీ ఆదేశాలకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ అసమ్మతి వర్గం బుధవారం ఛలో గాంధీభవన్ కు బయలుదేరుతుండగా ఎమ్మెల్యే వర్గం వారు అడ్డుకున్నారు.దీంతో అక్కడ ఘర్షణ ఏర్పడినట్లు సమాచారం.దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లు,కర్రలతో దాడులకు దిగడంతో అర్వపల్లిలో హై టెన్షన్ వాతావరణ ఏర్పడింది.ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా కారుతోపాటు మరికొన్ని వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చదరగొట్టేందుకు లాఠిచార్జ్ చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







