2 June, 2026 | 3:47 AM

ఆదిలాబాద్ గూడాల్లో గుడిసెలు ఉండొద్దు!

02-06-2026 02:56 AM
  1. తుమ్మిడిహట్టి కోసం ఎవరినైనా ఎదుర్కొంటా
  2. రైతుల కోసం వెనక్కి తగ్గేదే లేదు
  3. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలి
  4. లేదంటే జూన్ 15 తర్వాత కార్యాచరణ 
  5. తడిసిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది 
  6. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రైతుల ఆవేదన ఉప్పెనగా మారుతుంది.

 -రేవంత్‌రెడ్డి

పోలవరం కోసం ఏడు మండలాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రైతుల కోసం అవసరమైన భూమిని ఇప్పించలేదా?.  రైతుల ప్రయోజనాల కోసం ఎవరినైనా ప్రశ్నిస్తాను. ప్రధాని మోదీ అయినా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అయినా ఐ డోంట్ కేర్.   

-రేవంత్‌రెడ్డి

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మా ణం, రైతుల ప్రయోజనాలు, ఆదివాసీల సంక్షేమం విషయంలో ఎవరినీ లెక్కచేయబోనని.. ‘ఐ డోంట్ కేర్’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు అందించడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి బాట’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని, జల్-జంగల్-జమీన్ నినాదంతో అమరవీరుడు కుమ్రం భీం చేసిన పోరాటం దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు. అమరవీరుల సాక్షిగా ఆదివాసీల సంక్షేమం, ఆదిలాబాద్ అభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశా రు. ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం ద్వారా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గిరిజన గూడెంలో పక్కా ఇళ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్న రేవంత్‌రెడ్డి.. గుడిసెలు లేని ఆదిలాబాద్‌ను చూడడమే తమ లక్ష్యమన్నారు.

రెండో విడతలో 2.50 లక్షల ఇండ్లు

పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమ లు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటా యించడంతో పాటు ఐటీడీఏ ప్రాంతాలకు అదనంగా 21 వేల ఇండ్లు మంజూరుచేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 1.20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించామని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.

సెప్టెంబర్ 17 నాటికి మరో లక్ష ఇండ్ల గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేస్తామని, అర్హులైన ఆదివాసీలందరికీ ఇండ్లు అందించే వరకు ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. గూడాల్లో పర్యటించి గుడిసెలను గుర్తించి అర్హుల జాబితాలను సిద్ధంచేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. 

కాళేశ్వరంతో ఆదిలాబాద్‌కు ప్రయోజనం దక్కలేదు

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆదిలాబాద్ జిల్లాకు ఆశించిన ప్రయోజనం దక్కలేదని సీఎం విమర్శించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్ప మని తెలిపారు. ఇందుకోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినా స్పందన రాలేదని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల అవసరాలను గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.

మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రైతుల ఆవేదన ఉప్పెనలా మారుతుందని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తెలంగాణ రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ‘పోలవరం కోసం ఏడు మండలాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రైతుల కోసం అవసరమైన భూ మిని ఇప్పించలేదా?’ అని ఆయన ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల కోసం అవసర మైతే ఎవరినైనా ప్రశ్నిస్తానని, మోదీ అయి నా, కిషన్‌రెడ్డి అయినా లెక్కచేయనని సీఎం అన్నారు. తనకు రైతుల ప్రయోజనాలే ము ఖ్యమన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. 

కేంద్రం ముందుకు రావడం లేదు

ధాన్యం కొనుగోలు అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సీఎం విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం 65 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని సేకరించినప్పటికీ, కేంద్రం కొనుగోలు ప్రక్రియలో ముందుకు రావడం లేదని ఆరోపించారు. కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం కొనుగోలు బాధ్యత నుంచి తప్పించుకోకూడదన్నారు. కిషన్‌రెడ్డి కేంద్రంతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

ఈ విషయంలో స్పందన లేకపోతే జూన్ 15 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని సీఎం హెచ్చరించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందవద్దని సూచించారు. తడిసిన ధాన్యం తో సహా ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేకానంద, సీతక్క, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ,  నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ హరిత, ఎస్పీలు నితికా పంత్, అఖిల్ మహాజన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కష్టాలు తీర్చుతున్న ప్రభుత్వం: పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదవాడి కష్టాలు తీర్చేం దుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు కేటాయించి ప్రతి ఆదివాసి గ్రామం, గూడాలలో అర్హులకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

లక్ష 20 వేల ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశం చేయడం సంతోషంగా ఉందని, ఇండ్ల కేటాయింపులో ఎలాంటి బేధాలు లేకుండా అర్హులైన నిరుపేదలకు కేటాయించి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడతామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న ఇండ్లను గుర్తించి పూర్తిచేసే విధంగా 2వ విడత ఇందిరమ్మ ఇండ్లపథకంలో ఇంటి నిర్మాణ పరిస్థి తిని బట్టి నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదవాడి భద్రత- భరోసా ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. 

వాగ్దానాలు నెరవేర్చేందుకు కృషి: జూపల్లి కృష్ణారావు

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగా ణను తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి నిర్వహణ సక్రమంగా చేపడుతూ, వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి అనేక పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. 

సొంతింటి కలను నెరవేరుస్తున్నాం: సీతక్క

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, పేద ప్రజల అవసరాలు తీరుస్తూ సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీల జీవితాలలో కూడు,- గుడ్డ,- గూడు అందించి వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయ సాగుకు నీరు అందించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిం చడం, అర్హులైన పోడురైతులకు పోడు భూ ముల పట్టాలు అందించడంతోపాటు మా ర్మూల ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదివాసిగూడాల్లో ఇంది రమ్మ ఇండ్లు నిర్మించి అర్హులకు అందించడం సంతోషంగా ఉందని, లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపిస్తున్నదని తెలిపారు.