జలాశయాలపై.. ఆశలన్నీ ఆవిరే
సాగు సంకటమే!
గ్రౌండ్ రిపోర్ట్-3
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండుతున్న ప్రాజెక్టులు
- నెమ్మదించిన వరి సాగు,- పెరిగిన ఆరుతడి
- కామారెడ్డి జిల్లాలో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు వెలవెల
నల్లగొండ/కామారెడ్డి బ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో వరిసాగయ్యేది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే. అయితే గతంతో పోల్చి తే ఈ వానాకాలం సీజన్‌లో వర్షపాతం చాలా తక్కువగా నమోదు కావడానికి తోడు జలాశయాలలో నీరు అడుగంటడంతో సాగు తగ్గింది. ఎల్ నినో ప్రభా వంతో వానలు కురవకపోవడంతో పంట ల సాగు నెమ్మదిగా సాగుతోంది. దీంతో రైతులు మెట్ట పంటలపై దృష్టిసారించారు.
మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు వర్షాలు లేక వెలవెలబోతున్నాయి. గతేడాది ఇదే సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రాజెక్టు ల్లో నీటిమట్టం పెరిగి ప్రాజెక్టు కింది భాగంలోని రైతులకు వరి పంట సాగుకు విడు దల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రధా న ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం గత ఏడాది కంటే తగ్గుముఖం పట్టింది. వర్షాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజు లు దాటినా వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో పంటలు వేసేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు.
మెట్టసాగుకే మొగ్గు..
నల్లగొండ జిల్లాలో.. వ్యవసాయశాఖ నివేదిక ఆధారంగా గతేడాది జూలై రెండో వారం నాటికి మెట్ట పైర్లకంటే వరి సాగే ఎక్కువగా ఉన్నది. ఈ సీజన్‌లో అదే సమయానికి వరి కంటే మెట్టపంటల సాగు ఎక్కువైంది. వర్షాలు కురవకపోవడంతో బోర్లు, బావులున్న రైతులు తమకున్న నీటి వనరులను అనుసరించి తమకు ఉన్న భూమిలో కొంత మేర సాగుకు సన్నద్ధం అవుతున్నారు. వర్షం మీద ఆధారపడ్డ చిన్న, సన్నకారు రైతులైతే అసలు సాగుకే వెనకాడుతున్నారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ఇప్పటి వరకు సాగుకు సంబంధించిన ఆలోచనే చేయ డం లేదు. జూలై మొదటివారం వరకు నల్లగొండ జిల్లాలో 5,10,327 ఎకరాల్లో (45.44 శాతం) ఎకరాల్లో పంటలు సాగు చేశారు. సూర్యాపేటలో 77,510 ఎకరాల్లో (13.35 శాతం), యాదాద్రిలో 1,12,375 ఎకరాల్లో (26.48 శాతం) పంటలు వేశారు.
వ్యవసాయశాఖ నివేదికల ప్రకారం గతేడాది జూలై మొదటి వారం వరకు పంటల సాగు విస్తీర్ణం 5.30 లక్షల ఎకరాలు ఉండగా, ఈసారి అది సుమారు 7 లక్షల ఎకరాల్లో ఉంది. ఇందులో గతేడాది మెట్ట పంటల సాగు 4.68 లక్షల ఎకరాలుండగా.. ఈఏడాది ఇదే కాలానికి ఆ పంటల సాగు 6.47 లక్షల ఎకరాల్లో ఉంది. అంటే 1.79 లక్షల ఎకరాలు ఎక్కువ. ఇందులో ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో ఉన్న పత్తి గతేడాదిలో 4.57 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈసారి దానిని 6.39 లక్షల ఎకరాల్లో విత్తారు.
ఈ లెక్కన 1.82 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అధికమైందనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక జిల్లాల పరంగా చూస్తే యాదాద్రిలో కాస్త తక్కువగా ఉంది. పత్తి విత్తనాలు విత్తుకునేందుకు ఇంకా సమయం ఉండటం.. ప్రభుత్వమే ఆ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
పెరిగిన పత్తి సాగు.. తగ్గిన వరి సాగు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి సాగు పెరిగింది. నల్లగొండ జిల్లాలో గతేడాది 3,52,201 ఎకరాల్లో పత్తి సాగు అయింది. ఈసారి 4,99,553 ఎకరాల్లో పత్తి వేశారు. సూర్యాపేట జిల్లాలో గతేడాది 29,079 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 68,265 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో గతేడాది 76,115 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 72,311 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఉమ్మడి జిల్లాల్లో వరి సాగు అంచనా 12.73 లక్షల ఎకరాలు.
జూలై మొదటి వారం నాటికి గతేడాది 62,532 ఎకరాల్లో సాగు చేసిన రైతు లు ఈసారి 52,716 ఎకరాల్లో నాట్లు వేశా రు. గతేడాది ఈ సమయానికి నల్లగొండ జిల్లాలో 20,780 ఎకరాల్లో వరి వేశారు. ఈసారి 9,287 ఎకరాలకే పరిమితమైంది. సూర్యాపేట జిల్లాలో గతేడాది 13,215 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 7,196 ఎకరా ల్లో, యాదాద్రి జిల్లాలో గతేడాది 28,537 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 36,231 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి యాదాద్రి జిల్లాలో 7,694 ఎకరాల్లో ఎక్కువగా నాట్లు వేయడం గమనార్హం. ఇక్కడ భూగర్భ జలాలు బాగుండటమే దానికి ప్రధాన కారణం.
ప్రాజెక్టుల్లో తగ్గిన నీటిమట్టం..
గతేడాది ఇదే సీజన్‌లో కామారెడ్డి జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 20.902 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం 15.049 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది కంటే 5.853 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెరిగితే నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, వరంగల్, ఖమ్మం జిల్లాలోని రైతులకు సాగు నీరు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదే జిల్లాలోని పోచారం ప్రాజెక్టులోకి గతేడాది భారీ వర్షాలు కురిసి సమృద్ధిగా నీరు చేరడంతో రైతులు వరి తూకాలు వేసి నాట్ల కోసం పొలాలను చదును చేశారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులోకి సరిపడ నీరు రాకపోవడంతో నాట్లు వేయాల వద్ద అనే కోణంలో రైతు లు ఆందోళన చెందుతున్నారు.
అలాగే నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు గతేడాది ఈ సమయానికి 6.542 టీఎంసీలు ఉండేది. ప్రస్తుత నీటిమట్టం 4.703 టీఎంసీలు ఉంది. గత ఏడాది కంటే 1.839 టీఎంసీల లోటు ఉంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని రైతులు వరి నాట్లు వేసేందుకు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఈ సీజన్‌లో నిజాంసాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిమట్టం ఉండగా ప్రస్తుతం తక్కువ స్థాయిలో నీటిమట్టం ఉండటంతో పంటలు వేసేందుకు రైతులు సంకోచిస్తున్నారు.






