సమస్యలకు చర్చలే పరిష్కారం.. అందుకే ఢిల్లీ వచ్చా
రాష్ట్రభివృద్ధిలో విమానాశ్రయాలది కీలక పాత్ర
న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో(Kinjarapu Ram Mohan Naidu) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) భేటీ అయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు అనుమతులు కోరినట్లు తెలిపారు. అభివృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలకమని సూచించారు. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని, పూర్తి చేయాలనేది తమ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రానికి మేలుచేసే పనులు పాడు చేయవద్దని సీఎం రేవంత్ విపక్షాలను కోరారు. 2028 జూన్ 2 నాటికి విమానాశ్రయాలు పూర్తి చేయాలనేది తన సంకల్పం అన్నారు. నాలుగు ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నట్లు వివరించారు. భూసేకరణ, అనుమతి, నిర్మాణం, ప్రారంభం. దిశగా పనిచేస్తున్నామని తెలిపారు.
కాకతీయ వారసత్వం(Kakatiya Heritage) ఉట్టిపడేలా మామునూ ఎయిర్ పోర్టు నిర్మిస్తామని సూచించారు. రాష్ట్రానికి సహకరిస్తున్న కేంద్రానికి, రామ్మోహన్ కు సీఎం రేవంత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొన్ని సమస్యలకు చర్చలే పరిష్కారం.. అందుకే ఢిల్లీ వచ్చానని పేర్కొన్నారు. కేంద్రమంత్రులను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. తన ఢిల్లీ పర్యటనపై(CM Revanth Reddy's Delhi visit) విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోనని కొట్టి పారేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరోసారి ఢిల్లీ వస్తానని చెప్పారు. కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై విజ్ఞప్తులు చేస్తానన్నారు. కేంద్ర ప్రాధాన్యతగా తీసుకోకుంటే పనులు వేగంగా జరగవని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల(Telangana Project) పూర్తికి రామ్మోహన్ పూర్తిగా సహకరిస్తున్నారని కొనియాడారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ రాష్ట్రంగా నిలపాలనేదే తన లక్షమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.






