28 July, 2026 | 6:57 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సంతకాల సేకరణ

28-07-2026 06:19 PM

కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చేయించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి ఆధ్వర్యంలో ఫీజు బకాయి బిజెపి లడాయి ఉద్యమంలో భాగంగా విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తిలోని ప్రభుత్వ మోడ్రన్ డిగ్రీ , జూనియర్ కళాశాలలో విద్యార్థులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వివరాలను విద్యార్థులతో స్వయంగా రాయించి సంతకాలు సేకరించారు.

ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు వంటి హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. గత ఐదేళ్లుగా ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.5,000 చొప్పున రావాల్సిన మొత్తం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే యువమోర్చా ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

జిల్లా కన్వీనర్ బోడ నరసింహ మాట్లాడుతూ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆలస్యం చేయకుండా వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దుర్గాప్రసాద్, నాయకులు నరెడ్ల శేఖర్ రెడ్డి, సురేందర్ గౌడ్, బచ్చలకూర శ్రీశైలం, పద్మ అనిల్, నాప శివ పాల్గొన్నారు.