సహాయ ఉపకరణాల గుర్తింపు నిర్ధారణ శిబిరం ప్రారంభం
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ,(విజయక్రాంతి): ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శిబిరంలో అన్ని వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఎదురుగా గల జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో సమగ్ర శిక్ష, భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (Artificial Limb Manufacturing Corporation of India) సంయుక్తంగా సహాయ ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అంగవైకల్యంతో శిబిరానికి వచ్చిన వారికి సరైన వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని, భోజనం, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు ఉన్న సమస్యలను వైద్యులకు స్పష్టంగా తెలియజేయాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ శిబిరానికి సుమారు 149 మంది ప్రత్యేక అవసరాలు గల బాలబాలికలు హాజరవుతున్నారని, అలిమ్కో నుంచి వైద్య, సాంకేతిక బృందం పరీక్షల నిమిత్తం పాల్గొంటోందని తెలిపారు. తల్లిదండ్రులు ఓపికగా ఉండి నిర్ధారణ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని, దీని ఆధారంగా వారికి అవసరమైన ఉపకరణాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరంలో నిర్ధారణ ఆధారంగా మూడు చక్రాల బండ్లు, చక్రాల కుర్చీలు, చేతికర్రలు, కాలిపర్స్, వినికిడి యంత్రాలు తదితర సహాయ ఉపకరణాలు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎస్. ప్రకాష్, సీఎంఓ నాగరాజు, వైద్యులు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.