పుష్కర పనులకు స్పీడ్

28-09-2026 | 04:34pm

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

మంథని ఘాట్ల అభివృద్ధి, గౌతమేశ్వర ఆలయ పునర్నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

భూసేకరణను సకాలంలో పూర్తిచేయాలి

మంథని పర్యటనలో కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని,(విజయక్రాంతి): గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మంథని పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya sriharsha) అధికారులను ఆదేశించారు. సోమవారం మంథనిలో పర్యటించిన ఆయన పుష్కర ఘాట్ల అభివృద్ధి(Development of Pushkara Ghats), గౌతమేశ్వర ఆలయ పునర్నిర్మాణం, పుష్కరాల కోసం చేపట్టాల్సిన భూసేకరణ అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం ఆర్డీవో కార్యాలయంలో సంబంధిత అధికారులు, రైతులతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. పుష్కరాల అవసరాలకు సంబంధించిన ఎండోమెంట్, ఇరిగేషన్ శాఖల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటూనే, అభివృద్ధి పనులకు అవసరమైన భూమిని సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

పుష్కర ఘాట్ల పనులు వెంటనే ప్రారంభించాలి

పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను ఆలస్యం లేకుండా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, రహదారులు, పార్కింగ్, భద్రత వంటి మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

గౌతమేశ్వర ఆలయ పనులకు వేగం

మంథనిలోని గౌతమేశ్వర ఆలయ(Gowthameshwara Temple) పునర్నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎండోమెంట్ శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రతి పనికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు.

డిగ్రీ కళాశాలలో వసతులు కల్పించాలి

మల్లెపల్లి బాలుర డిగ్రీ కళాశాలను స్థానిక బాలుర పాఠశాల ఆవరణలోకి మార్చిన నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. తరగతి గదులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, ఫర్నిచర్ తదితర సదుపాయాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో ఆర్డీవో సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ ఆరిఫోద్దీన్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, ఎండోమెంట్, ఇరిగేషన్ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు