చెరువు పనులు వెంటనే పూర్తి చేయాలి
మద్దిమల్ల రాయిని చెరువు నుంచి ఎంఆర్వో కార్యాలయం వరకు బీజేపీ పాదయాత్ర
వీర్నపల్లి సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) వీర్నపల్లి మండల కేంద్రంలోని మద్దిమల్ల రాయిని చెరువు పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు సోమవారం భారీ పాదయాత్ర చేపట్టారు. మద్దిమల్ల రాయిని చెరువు నుంచి వీర్నపల్లి ఎంఆర్వో కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి, చెరువు పనుల జాప్యంపై నిరసన వ్యక్తం చేశారు. నైన్త్ ప్యాకేజీ కింద చేపట్టిన చెరువు పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు, ప్రజలకు ప్రయోజనం కల్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో చెరువుపై ఆధారపడే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి మద్దిమల్ల రాయిని చెరువు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని బీజేపీ నాయకులు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు స్పష్టం చేశారు. చెరువు పనుల జాప్యాన్ని ఇకనైనా నివారించి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.