4 August, 2026 | 2:50 AM

పెట్టుబడులతో కదలిరండి

04-08-2026 01:16 AM
  1. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి
  2. సింగిల్ విండో విధానంతో అనుమతులు
  3. పారిశ్రామికంగా, సామాజికంగా మీ వెన్నంటి ఉంటాం
  4. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ
  5. ఎన్నారైల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
  6. ఆట జాతీయ మహాసభల్లో డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ప్రవాస భారతీయులు.. తాము సాధించిన విజ్ఞానాన్ని, మేధస్సును సొంత రాష్ట్రం, పుట్టి న గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని మేరీల్యాండ్ రా ష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 19వ ఆట జాతీయ మహాసభలకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిం చారు.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసులు ముం దుకు రావాలని కోరారు. ‘మీకోసం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేశాం. అన్ని అ నుమతులు వెంటనే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. పారిశ్రామికంగా, సామాజికంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో మేము వెన్నంటి ఉంటాం’ అని చెప్పారు.

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మలచాలనే స్పష్టమైన ప్రణాళికతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని తెలిపారు. పెట్టుబడులకు, పరిశ్రమలకు అత్యంత అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం వేగంగా దూసుకెళ్తోందని వివరించారు.

ఇందులో భాగంగా హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న 56 కిలోమీటర్ల మూసీ నదిని లండన్ లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరిస్తున్నామని, స్వచ్ఛమైన నీరు పారేలా ప్రక్షాళన చేసి నగర రూపురేఖలు మార్చబోతున్నామని వెల్లడించారు.  అంతేకాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు  దీటుగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆ ప్రాంతాన్ని ఆనుకుని సరికొత్తగా ’ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. 

ఎన్నారైల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు తెలంగాణలో ఉంటున్న వారి తల్లిదండ్రుల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధత (లీగల్ స్టేటస్) కలిగిన ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ ఆలోచనలో ఉందన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రవాసులు.. తమ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక వేదిక కావాలని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంపై ఆయన సానుకూలంగా స్పందించారు.

ప్రపంచంలో ఎక్కడున్న తెలంగాణ వాసులైనా తమ ఇబ్బందులను లేదా రాష్ట్రంలో ఉంటున్న తమ తల్లిదండ్రుల సమస్యలను ఈ ప్రత్యేక వ్యవస్థ దృష్టికి తీసుకొస్తే.. వాటిని సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్ )  ప్రక్రియ కొనసాగుతోందని  ప్రవాసులకు గుర్తుచేశారు. ప్రవాసులంతా తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.