7 September, 2026 | 5:15 AM

విజయానికి దిక్సూచి

07-09-2026 | 04:00am

విద్యావంతులకు సంస్కారం సహజభూషణం. దాన్నే మనం అక్షరజ్ఞానంగా అభివర్ణిస్తాం. సమాజంలో ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించాడంటే, అతను తన గత జీవిత పాఠాల (Life lessons) నుంచి నిరంతరం నేర్చుకున్నాడని స్పష్టమవుతోంది. జీవన గమనంలో స్వయంకృషితో ముందడుగు వేయ డం అభినందనీయమే (Congratulations) అయినప్పటికీ, ఒక సరైన దిక్సూచిని (మార్గదర్శిని) అనుసరించినప్పుడు మాత్రమే అసాధారణ విజయాలు సాధ్యమవుతాయి.

ఉద్యోగ జీవితానికి ఆధారమైనది చదువు మాత్రమేనని నమ్మిన వ్యక్తి కోట దామోదర్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మారుమూల గ్రామం గుమ్మడవెల్లిలో ప్రాథమిక విద్య, డిప్లొమా పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎల్మోట్ ఆల్టర్నేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డిజైన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే, చదువుకునే విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం కోసం ఎంతోమంది గొప్ప వ్యక్తుల జీవితాలను ‘అవరోధాలే అవకాశాలు’ పేరుతో వ్యాస సంపుటిగా రాశారు.

ఇందులో మొత్తం 27 స్ఫూర్తిదాయకమైన వ్యాసాలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం, మణి నగరం ప్రాంతానికి చెందిన పూర్ణ సుందరి ఐదేళ్ల వయస్సు వరకు సాధారణ పిల్లలాగే చదువుకుంది. అయితే ఒక అనుకోని సంఘటన వల్ల ఆమె కంటి చూపు క్షీణించింది. ఆమె తల్లిదండ్రులు చూపు తెప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. కూతురి భవిష్యత్తు కోసం తల్లి స్వయంగా పుస్తకాలు చదివి వినిపించేది.

అలా విద్య పూర్తిచేసిన పూర్ణ సుందరి, తన జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో సివిల్స్ పరీక్ష రాసింది. వరుసగా మూడు సార్లు వైఫల్యం ఎదురైనప్పటికీ నిరాశ చెందకుండా, తన లోపాలను సవరించుకుని నాలుగోసారి సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించారు. అన్ని అవయవాలు బాగున్నా కుంటిసాకులు చెప్తూ భవిష్యత్తును పాడుచేసుకుంటున్న నేటి యువతకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో రచయిత ఈ ప్రయత్నం చేశారు.

పల్లెటూరులోని ఒక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో జన్మించినప్పటికీ, జీవితంలో ఎలాగైనా సరే ఉన్నత స్థాయికి చేరుకోవాలనే బలమైన పట్టుదల ఆయనకు ఉండేది. అవసరానికి పది రూపాయలు ఇచ్చి సహాయం చేసే బంధువులు లేరు కానీ, ఉచితంగా సలహాలు ఇచ్చే వారికి మాత్రం కొదవ లేదు. ‘చదువు చాలించి ఏదైనా మెకానిక్ పని నేర్చుకుంటే నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చు’ అని కొంతమంది అంటే, ‘త్వరగా పెళ్లి చేసుకుని ఏదో ఒక కూలీనాలీ పని చేస్తూ బతకడం మంచిది’ అని మరికొందరు అనేవారు.

‘ఎంత చదివినా ఉద్యోగాలు రావు, చిన్నదో పెద్దదో ఏదో ఒక కష్టం చేసుకుని బతకడమే ఉత్తమం’ అంటూ చుట్టూ ఉన్నవారు అన్న మాటలు ఆయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఎవరి నుంచీ ఎలాంటి ఆసరా లేకపోయినా, కన్న తల్లి చెప్పిన  ‘కొడకా నీవు పెద్ద చదువులు చదుకో’ అనే మాట కొండంత అండగా నిలిచింది. ఎన్నో కష్టనష్టాలను అధిగమించి, చివరికి సివిల్స్ పరీక్షలో విజయం సాధించి భారతీయ తపాలా శాఖలో ఉన్నత అధికారిగా బాధ్యతలు చేపట్టారు.

తన జీవిత పోరాటం నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో డాక్టర్ వెన్నం ఉపేందర్ ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ అనే నవలను రచించారు. సమాజంలో గుర్తింపు పొందిన ఎంతోమంది క్రీడాకారులను నిత్యం టెలివిజన్, వార్తాపత్రికల్లో చూసి ఆనందిస్తుంటాం. వాళ్లలాగే మనం కూడా ఆ స్థాయికి చేరుకోవాలనుకుంటాం. కానీ వారు ఆ స్థాయికి చేరుకోవడానికి వెనుక ఉన్న శ్రమను తెలుసుకోము. ఎవరూ సాధించలేని విజయాన్ని ఒకరు సాధించారంటే, అది పట్టుదలతో కూడిన శ్రమ వల్లే సాధ్యమవుతుంది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే ఉసేన్ బోల్ట్ ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి సాధన చేసేవాడు. అలా ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతకాలతో పాటు మరెన్నో విజయాలు సాధించాడు. నిరంతర సాధన ఉంటే ఈ ప్రపంచంలో మనిషి సాధించలేనిది ఏదీ లేదనడానికి ఉసేన్ బోల్ట్ జీవితమే ఒక ఉదాహరణ. చదువులో కాస్త వెనుకబడిన ఒక వ్యక్తి, తన తల్లి కష్టాన్ని చూసి కొత్తగా ఆలోచించాడు. ఒక చీర నూలును ఆసు పోయాలంటే చేతితో 9,000 సార్లు తిప్పాలి; దానికి 4 నుంచి 5 గంటల సమయం పట్టేది.

ఈ సమస్యకు పరిష్కారంగా సరికొత్త ఆలోచనతో చింతకింది మల్లేశం ఏడేళ్ల పాటు కష్టపడి ‘లక్ష్మీ ఆసు యంత్రం’ కనిపెట్టారు. ఇది ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఫోర్బ్స్ జాబితాలోనూ ఆయనకు చోటు దక్కింది. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి సోనమ్ వాంగ్‌చుక్ చేసిన ప్రయోగాత్మక ఆలోచన వేలాది మంది దాహార్తిని తీర్చింది. ఆ ప్రాంతంలో చదువులో ఉత్తీర్ణత శాతాన్ని 5% నుంచి 75% వరకు పెంచడంలో ఆయన కృషి ఎంతో గొప్పది.

లఢఖ్ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఆయన శిక్షణ ఇచ్చారు. సోలార్ హీటెడ్ టెంట్లను, భీకరమైన శీతాకాలాన్ని సైతం తట్టుకునే విధంగా మట్టితో నిర్మించే సౌర-శక్తి ఆధారిత భవనాలను ఆయన రూపొందించారు. కులవృత్తిలో నిమగ్నమైన బికాష్ అనే వ్యక్తికి చిన్నతనంలో ఇంగ్లీష్ చదువు చెప్పించి, భవిష్యత్తుకు స్థిరమైన పునాది వేసిన భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ కుటుంబం చేసిన మేలును ఆయన జీవితాంతం గుర్తుంచుకున్నారు.

అరుణ్ లాల్ జీవిత చరమాంకంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులను తీర్చి, అద్భుతమైన రీతిలో సహాయం అందించారు. అటెండర్ స్థాయి నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి నిందర్ ఘుగియాన్వి. ఆయన రాసిన రచనలు ఇంగ్లీష్‌తో పాటు 15 భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. గురునానక్ దేవ్, పంజాబీ, ఢిల్లీ విశ్వవిద్యాలయాలతో పాటు మొత్తం 12 వర్సిటీల్లో ఎం.ఫిల్, పిహెచ్.డి విద్యార్థులు ఆయన రచనలపై పరిశోధనలు చేశారు.

ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సరే, ఆత్మవిశ్వాసం, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఉంటే విజయతీరాలకు చేరుకోవచ్చని ఈ పుస్తకం మనకు నిరూపిస్తుంది. సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తుల జీవిత విశేషాలను అందిస్తూ... నేటి యువతలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు నూరిపోసే అద్భుతమైన మార్గదర్శి ఈ ‘అవరోధాలే అవకాశాలు’. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా విద్యార్థులు తప్పక చదవాల్సిన స్ఫూర్తిదాయక గ్రంథమిది.

పుస్తక రచయిత: కోట దామోదర్, పేజీలు: 118

వెల: 200, ప్రతులకు: 9391480475

కొండేటి ప్రకాష్ 7981781086

మరిన్ని వార్తలు