రైతులను ముంచిన కాంగ్రెస్

16-04-2024 04:13:14 PM

l ఆ పార్టీ రైతు డిక్లరేషన్ పచ్చి బోగస్

l రైతు రుణమాఫీకి పైసల్లేవు కానీ.. ఢిల్లీకి తరలించటానికి ఉంటాయా?

l గజ దొంగలు పోయి ఘరానా దొంగలొచ్చారు

l బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): రైతు డిక్లరేషన్ పేరిట అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ పచ్చి బోగస్ అని తేలిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. 100 రోజుల్లో హామీలు, గ్యారెంటీలు నెరవేరుస్తామని మాట ఇచ్చి, 4 నెలలు గడిచినా నెరవేర్చకుండా అన్నదాతను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి సోమవారం ఒకరోజు రైతుదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు.

సోనియమ్మ పాలన రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్న హామీ ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే గ్యారెంటీలు, హామీలు నెరవేరుస్తామని కొత్త పాట అందుకున్నారని ధ్వజమెత్తారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని, రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేది లేదని పేర్కొన్నారు. తెలంగాణలో గజ దొంగలు పోయి ఘరానా దొంగల పాలన వచ్చిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం పోయి సోనియాగాంధీ కుటుంబం అధికారంలోకి రావడం తప్పించి రాష్ట్రంలో వచ్చిన మార్పేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.

ధాన్యం కొనుగోళ్లు ఎక్కడ?

కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతులను మోసం చేసిందని, ఇప్పుడు ఆ పార్టీకి ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని కిషన్‌రెడ్డి నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని, తెలంగాణలో డబ్బు వసూలు చేసి ఢిల్లీలో ఇవ్వడానికి మాత్రం సమయం ఉంటుందని విమర్శించారు. ఎరువుల సరఫరాలో వైఫల్యం చెందినా, రుణాలు చెల్లించాలని రైతులను ఒత్తిడికి గురి చేసినా, విత్తానాలు అందకపోయినా, కల్తీ విత్తనాలను రైతులకు అంటగట్టినా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లో ఫిర్యాదు చేయాలని అన్నదాతలకు సూచించారు. 9904119119 నంబర్‌కు రైతులు మిస్డ్‌కాల్ ఇవ్వాలని సూచించారు. రైతులకు ఏ కష్టమొచ్చినా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.