కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తుంది
17 నుండి ప్రతి తండాలో నిరసనకు బీఆర్ఎస్ పిలుపు
విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
బాన్సువాడ,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చి దాదాపు 1000 రోజులు పూర్తయినా గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తుందని బాన్సువాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(Former MLA Bajireddy Govardhan) మండిపడ్డారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ(BRS Party) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల ఓట్లతో గెలిచి, అధికారంలోకి వచ్చాక వారినే మరచిపోయిందని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఉన్న భూములను లాక్కొని గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దాదాపు మూడేళ్లు కావస్తున్నా గిరిజనుల సంక్షేమానికి ఒక్క పైసా, ఒక్క పథకం కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 17వ తేదీ నుంచి బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి తండాలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. తండాల్లోని ప్రతి గిరిజన బిడ్డ కాంగ్రెస్ మోసాన్ని తెలుసుకోవాలని, పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనులకు నిజమైన న్యాయం జరిగిందని బాజిరెడ్డి గోవర్ధన్ గుర్తు చేశారు. రెండేళ్లలోనే గిరిజన సంక్షేమానికి కేసీఆర్ రూ.28 వేల కోట్లు కేటాయించారని, ఎస్టీ రిజర్వేషన్ను 6 నుంచి 10 శాతానికి పెంచారని, 56 వేల ఎకరాల బంజరు భూములను సాగులోకి తెచ్చి గిరిజనులకు అండగా నిలిచారన్నారు. ఎస్టీలకు ఐఐటీ స్టడీ సర్కిల్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, మౌలిక వసతుల కోసం వెయ్యి కోట్లు, గిరిజన మహిళలకు T-Hub ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో 57 నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి తండాలకు పాలనను చేరువ చేశారన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా కష్టపడ్డామో, ఇప్పుడు ప్రజల హక్కుల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇందులో గిరిజనులే ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, దుద్దాల అంజిరెడ్డి, మోరల్ శ్రీనివాస్ రావు, మోచి గణేష్, బోడ చందర్, సాయిబాబా, నర్సింలు గౌడ్ కిషన్,రవి ,దాస్, మొగులయ్య, సర్పంచ్ ధర్మతేజ, మాధవరెడ్డి, ఖలీల్, ఫెరోజ్, ఇషాక్, రమేష్ యాదవ్, శివ సాయి తదితరులు పాల్గొన్నారు.