ఎన్నికల వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉండాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఎన్నికల వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్(Election Commissioner Gyanesh Kumar) తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
జ్ఞానేశ్వర్ కుమార్ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇటీవల ప్రచురించిన కథనంలో ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు ఎస్ఐఆర్ ఓటర్ల నమోదు, తొలగింపు, ఫార్మ్ 6 మార్పులు, ఓటర్ల డేటా నిర్వహణ వంటి అంశాలపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వెల్లడైందని అన్నారు. కథనం ప్రకారం, గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో ఈ అభ్యంతరాలు నమోదు అయినట్లు పేర్కొన్నట్లు తెలిపారు.
ఈ పరిణామాలపై దేశ ప్రజలకు, ముఖ్యంగా ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడికి ఎన్నికల కమిషన్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి పారదర్శకతతో స్వతంత్ర విచారణ జరపాలని, అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కును నిర్ధారించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు.