ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ నాయకులపై గర్జించిన కాంగ్రెస్
దళిత స్పీకర్ పై వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ నిరసన
పటాన్ చెరు: దళిత స్పీకర్ పై బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ చేసిన అహంకారపూరిత, అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్ చెరు లో నిరసన(protest) ర్యాలీ నిర్వహించారు. పటాన్ చెరు డివిజన్ లోని గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు.
కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్(Dalit Speaker)పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ప్రజాప్రతినిధులు హుందాతనంతో వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను గౌరవించాలని సూచించారు. దళిత స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవులకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు గౌరవం ఉండేలా ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.