నిబంధనలు కచ్చితంగా పాటించాలి
గణేష్ మండప నిర్వాహకులకు సీపీ సూచన
సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా నిర్వాహకులు, వలంటీర్లు ఎల్లప్పుడూ పోలీసులతో సమన్వయం పాటిస్తూ సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్(Siddipet CP Rashmi Perumal) కోరారు. శనివారం గణేష్ మండప నిర్వాహకులతో(Ganesh Mandapa organizers) ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలపై పలు కీలక సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఉత్సవాల నిర్వాహకులు ముందుగానే గణేష్ మండపం వివరాలు, నిమజ్జనం తేదీ, శోభాయాత్ర రూట్ వివరాలను తెలంగాణ పోలీస్ పోర్టల్(Telangana Police Portal) ద్వారా కచ్చితంగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇంటిమేషన్ ఫారమ్స్ నమోదు చేయడం ద్వారా పోలీస్ బందోబస్తు, రూట్ ప్లానింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సజావుగా నిర్వహించడానికి వీలవుతుందని తెలిపారు. ప్రతి గణేష్ మండపంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా ఫైర్ ఎక్స్స్టింగ్విషర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విగ్రహాల ఊరేగింపు సమయంలో విద్యుత్ వైర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి మండపం వద్ద స్థానిక ఎస్హెచ్ఓ , విద్యుత్ శాఖ, మున్సిపల్, ఫైర్ అధికారుల అత్యవసర సంప్రదింపు నంబర్ల బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మండపాల వద్ద, శోభాయాత్రలో డీజేలను ఉపయోగించకూడదని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను, నకిలీ వార్తలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని, ఇతరుల భావాలను, మత విశ్వాసాలను దెబ్బతీసే ఆక్షేపణీయమైన సంగీతం, పాటలు లేదా స్లోగన్స్ వాడకూడదని హెచ్చరించారు. ప్రజలందరూ ఆధ్యాత్మిక వాతావరణంలో, శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలని సీపీ పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్, ఏడీఈ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.