కసాయి తల్లి!
కూతురు, కొడుకుపై కత్తితో దాడి
కూతురు మృతి, తృటిలో తప్పించుకున్న కొడుకు
చివరికి తానూ ఆత్మహత్యాయత్నం
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురంలో ఘటన
ఆలేరు, మార్చి 15 (విజయక్రాంతి): అల్లారు ముద్దుగా గోరు ముద్దలు తినిపించి ప్రేమను పంచిన తల్లి తన పిల్లపైనే కర్కశత్వంగా కత్తితో దాడి చేయడంతో కూతురు మృతి చెందింది. కొడుకు తృటిలో తప్పించుకోగా చివరికి ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురంలో శనివారం జరిగింది. బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్‌రెడ్డితో నీలిమ (40)కు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి కూతురు కృతిక (14), కుమారుడు అక్షిత్‌రెడ్డి (11) ఉన్నారు. కొంతకాలంగా నీలిమ మానసిక స్థితి సక్రమంగా లేనట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం ఉదయం పిల్లలిద్దరితో కలిసి నీలిమ తన తల్లిగారి ఊరైన యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురం వెళ్లింది. అక్కడ రాత్రి పిల్లలిద్దరూ నిద్రిస్తున్న సమయంలో నీలిమ ఒక్కసారిగా కత్తి తో వారిపై దాడికి దిగింది. తీవ్రంగా గాయపడిన కృతిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
తల్లి దాడి చేస్తుండగా అక్షిత్‌రెడ్డి చాకచక్యంగా తప్పించుకుని గదిలో నుంచి బయటకు పరిగె త్తాడు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. అనంతరం నీలిమ ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిం చింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను కిందికి దించి, చికిత్స నిమిత్తం ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




