ప్రాణహితకు ఊపిరి!
- పాత కాల్వలతో కొత్త ప్రణాళిక
- లిఫ్ట్‌కు బదులుగా గ్రావిటీ విధానం
- సుందిళ్ల బరాజ్‌కు నీటి తరలింపు
- తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్యలు
- ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణకు సమృద్ధిగా సాగునీరు
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి) : ఒకప్పుడు తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ప్రాణహిత ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కనున్నది. ప్రాణహిత నదీ జలాలను తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించే ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేప డుతోంది.
ఈ మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అలైన్‌మెంట్ సర్వే పూర్తయి ప్రాథ మిక నివేదిక ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. ప్రాణహిత ప్రాజెక్టుకు సం బంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో రూ.11.88 కోట్లతో టెండర్లు పిలిచింది.
ఈ టెండర్‌ను ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ దక్కించుకుని ప్రాజెక్టుకు సంబంధించిన అలైన్‌మెంట్ రిపోర్టును సిద్ధంచేసి ఇటీవల ప్రభుత్వానికి అందజేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత జియోగ్రాఫికల్, హైడ్రాలజీ, వరదల అంచనా తదితర అంశాలపై సమగ్ర అధ్యయనంచేసి పూర్తిస్థాయి డీపీఆర్ రూపొందించనున్నారు.
కొత్త ప్రణాళిక..
ప్రాణహిత ప్రాజెక్ట్ పనులు మొదటగా 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. అప్పట్లో సుమారు రూ.10 వేల కోట్ల వ్యయంతో తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు కాల్వల తవ్వ కం చేపట్టారు. మొత్తం 76.5 కిలోమీటర్ల మేర కాల్వలను తవ్వినా, తర్వాత రాజకీయ పరిణామాలు, ప్రాజెక్ట్ రూపకల్పనలో మార్పులతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్యంగా తీసుకోవడంతో ప్రాణహిత ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది.
ప్రస్తుతం కాంగ్రె స్ ప్రభుత్వం పాత పనులను వినియోగించుకుంటూ ప్రాజెక్టును కొత్త రూపంలో అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తవ్విన 76.5 కిలోమీటర్ల కాల్వలను వినియోగిస్తూ సుందిళ్ల బ్యారేజీ వరకు కొత్త అలైన్‌మెంట్ రూపొందించారు. ఈ ప్రణాళిక ప్రకారం మైలారం నుంచి మిట్టపల్లి వరకు 19.3 కిలోమీటర్ల టన్నెల్ నిర్మిం చాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత సుంది ళ్ల బ్యారేజీ వరకు 13.8 కిలోమీటర్ల కొత్త కాల్వ తవ్వేలా డిజైన్ సిద్ధం చేశారు. మొత్తం 109.7 కిలోమీటర్ల మేర నీటి మార్గం ఏర్పడేలా ప్రణాళిక రూపొందించారు.
గ్రావిటీ విధానం..
ప్రాణహిత ప్రాజెక్ట్ రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టిం ది. గతంలో రూపొందించిన డీపీఆర్ ప్రకా రం మైలారం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి నీటి ని ఎత్తిపోసే విధానం ఉండేది. అయితే ఈ విధానానికి భారీ ఖర్చు కావడం, నిర్వహణ వ్యయం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రస్తుత ప్రభుత్వం ప్రణాళికను మార్చింది. దీంతో లిఫ్ట్ సిస్టంను పూర్తిగా పక్కనపెట్టి, సహజ వాలు దిశను (స్లోప్) ఉపయోగించి గ్రావిటీ ద్వారా నీటిని సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించేలా కొత్త అలైన్‌మెంట్ రూపొందించారు.
ఈ విధా నం అమలు చేస్తే విద్యుత్ వినియోగం తగ్గడమే కాకుండా ప్రాజెక్ట్ నిర్వహణ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా లిఫ్ట్ నిర్మాణం అవసరం లేకపోవడంతో కా ల్వ పొడవు కూడా సుమారు ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. దీం తో ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం తగ్గడంతో పా టు పనులు కూడా వేగంగా పూర్తయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
సమృద్ధిగా సాగునీరు..
ప్రాణహిత ప్రాజెక్ట్ పూర్తి అయితే ఉత్తర తెలంగాణలో సాగునీటి పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణహిత నదీ జలాలను సుందిళ్ల బ్యారేజీకి తరలించడం ద్వారా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు తాగునీటి అవసరాలను కూడా తీర్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్ వంటి జిల్లాల్లో వ్యవసాయానికి నీటి అందుబాటు పెరిగే అవకాశముంది.
గతంలో ప్రారంభమైన ప్రాణహిత ప్రాజెక్ట్ పూర్తికాకపోవడంతో ఆశలు నిలిచిపోయిన రైతులకు ఈ కొత్త ప్రణాళికతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అంతేకాకుండా సుందిళ్ల బ్యారేజీ ద్వారా నిల్వచేసే సుమారు 80 టీఎంసీల నీటిని వివిధ కాల్వల ద్వారా పంపిణీ చేస్తే సాగునీటి సామర్థ్యం పెరిగి ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డీపీఆర్ సిద్ధమై అమలు దశలోకి వెళితే తెలంగాణలో నీటి వినియోగం మరిం త సమర్థవంతంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మహారాష్ట్రతో చర్చలు..
ప్రాణహిత ప్రాజెక్ట్‌లో కీలక అంశమై న బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్ర భుత్వంతో చర్చలు జరపాల్సి ఉంది. గతంలో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలనే ప్రతిపాదన ఉండగా మ హారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది. తమ రాష్ట్రంలో ముంపు ప్రభా వం తగ్గేలా 148 మీటర్ల ఎత్తుకు పరిమి తం చేయాలని సూచించింది.
దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం బ్యారేజీ ఎత్తును 149 నుంచి 150 మీ టర్ల మధ్యలో నిర్ణయించే దిశగా ఆలోచిస్తోంది. సుమారు 6.5 కిలోమీటర్ల పొ డవున కాంక్రీట్ నిర్మాణంతో పాటు బండ్ ఏర్పాటు చేసి సుమారు 80 టీ ఎంసీల నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించే విధంగా డీపీఆర్ సిద్ధం చేసే ప్ర యత్నాలు జరుగుతున్నాయి.




