29 July, 2026 | 11:43 AM

చంపుతామని బెదిరింపు కాల్స్

27-05-2024 12:05 AM

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపణ

న్యూఢిల్లీ, మే 26: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గొడవ తర్వాత తన వ్యక్తిత్వాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించిన కొందరు, ఇప్పుడు చంపుతామని ఫోన్‌చేసి బెదిరిస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఆందోళన వ్యక్తంచేశారు. యూట్యూబర్ ధృవ్‌రాథీ తనకు వ్యతిరేకంగా ఓ వీడియో పోస్ట్ చేసిన తర్వాత బెదిరింపులు మరింత పెరిగాయని ఆరోపిం చారు. ‘నా పార్టీ నేతలు, కార్యకర్తలు నా వ్యక్తిత్వాన్ని అవమానించే ప్రచారం మొదలుపెట్టిన తర్వాత, బాధితురాలినే నిందితురాలిగా చిత్రించటం మొదలుపెట్టిన తర్వాత నన్ను చంపుతామని, లైంగికదాడి చేస్తామని బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి.

యూట్యూబర్ ధృవ్ రాథీ నాకు వ్యతిరేకంగా ఏకపక్ష వీడియోను పోస్ట్ చేసిన తర్వాత ఈ బెదిరింపుకాల్స్ ఇంకా పెరిగాయి’ అని ఆదివారం ఆమె ఎక్స్‌లో పోస్ట్ పెట్టా రు. కేజ్రీవాల్ సహాయకుడిపై చేసిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయని పేర్కొన్నారు. తన అభిప్రాయాలు, వాదనను వినిపించేందుకు ప్రయత్నిస్తే ధృవ్ రాథీ తన ఫోన్ ఎత్తటం లేదని ఆరోపించారు. కొందరు స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకొంటూ ఆప్ అధికార ప్రతినిధిలా వ్యవహరించటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.